శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను బాంబుతో పేల్చేస్తామంటూ వచ్చిన మెయిల్‌ను.... ఫేక్ మెయిల్‌గా పోలీసులు తేల్చారు. మెయిల్ ఎక్కడ్నుంచి వచ్చిందో గుర్తించిన పోలీసులు.... నిందితుడు సాయిరాం కాలేరును అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసుల ఇంటరాగేషన్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి.
బెదిరింపు మెయిల్‌పై దర్యాప్తు చేపట్టిన పోలీసులు... సాయిరాంను ప్రశ్నించారు. అయితే, తానెలాంటి మెయిల్ చేయలేదని సాయిరాం చెప్పడంతో... వివిధ కోణాల్లో విచారణ సాగించారు. దాంతో మరో కుట్ర కోణం వెలుగుచూసింది. సాయిరాం స్నేహితుడు శశికాంత్ అసలు నిందితుడిగా గుర్తించి... అదుపులోకి తీసుకున్నారు.
సాయిరాం, శశికాంత్... ఇద్దరు స్నేహితులు. అయితే కెనడా వెళ్లేందుకు ప్రయత్నిస్తోన్న సాయిరాం... శశికాంత్ ఇంట్లో కంప్యూటర్‌ను ఉపయోగించుకుని వీసా కోసం అప్లై చేసుకున్నాడు. అదే సమయంలో సాయిరాం వివరాలు రహస్యంగా సేకరించిన శశికాంత్.... కెనెడా వీసా వెబ్‌సైట్‌లో సాయిరాం పేరుతో అసభ్య పదజాలంలో సమాచారం అప్లోడ్ చేశాడు. దాంతో రాజకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు సాయిరాం ఫిర్యాదు చేశాడు.
ఇదే క్రమంలో సాయిరాం కెనడా వెళ్లకుండా అడ్డుకునేందుకు శశికాంత్ విశ్వప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగా, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి సాయిరాం కెనడా వెళ్లనున్నాడని తెలుసుకున్న శశికాంత్.... సాయిరాం మెయిల్ ఐడీ నుంచి బెదిరింపు ఈ-మెయిల్ పంపాడు. పోలీసుల దర్యాప్తులో అసలు నిందితుడు ఎవరో తేలడంతో... శశికాంత్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.