దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. 50 సంవత్సరాల మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి జరిపాడో మృగాడు. ఈ ఘటన లజ్‌పత్ నగర్లో చోటుచేసుకుంది. లజ్‌పత్ నగర్‌లోని పార్కులో అపస్మారకస్ధితిలో పడి ఉన్న బాధితురాలిని గుర్తించిన కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని సప్ధర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు వైద్యులు అనుమానిస్తున్నారు.
వైద్య పరీక్షల అనంతరం బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేస్తామని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పార్క్ పరిసర ప్రాంతంలో ఓ వ్యక్తి పరుగెత్తినట్టు గుర్తించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్స్ ఓ రెస్టారెంట్లో పనిచేసిన సుధీర్ గా తేలింది. సదరు మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్టు విచారణలో అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఆ మహిళ ఒంటరిగా ఉన్నట్టు గుర్తించి ఈ దారుణానికి తెగబడినట్టు సుధీర్ చెప్పాడని పోలీసులు వెల్లడించారు.