మేకలు కాసే ఒక వ్యక్తి దగ్గర AK 47 ఎలా వచ్చింది? ఒక మామూలు వ్యక్తి AK 47 లాంటి ఆయుధాన్ని ఎలా ఆపరేట్ చేయగలడు? మూడేళ్ల క్రితం పోలీస్ స్టేషన్లో మాయమైన ఆయుధాలు మేకలు కాసే వ్యక్తి వద్ద ఎలా ఉన్నాయి? సంచలనం సృష్టించిన అక్కన్నపేట్ కాల్పుల ఘటనలో ఇలా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట్ లో వ్యక్తిగత తగాదాల నేపథ్యంలో సదానందం అనే వ్యక్తి తన సమీప బంధువు గంగరాజుపై AK 47తో కాల్పులు జరిపిన సంఘటన సంచలనం సృష్టించింది. గ్రామంలో మేకలు కాసుకుని జీవించే సదానందం వద్ద అసలు AK 47 ఎలా వచ్చింది. అసలు AK 47ను ఎలా ఆపరేట్ చేయగలిగాడు. దీనిపై ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి.
సదానందం స్వస్థలం సిద్దిపేట జిల్లా కోహెడ. ఎనిమిదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం తన మేనమామ స్వగ్రామమైన అక్కన్నపేట్ కు వచ్చాడు. మేనమామ ఇంట్లోనే ఉంటున్నాడు. గ్రామంలో మేకలు కాసి జీవిస్తున్నాడు. కొద్దిరోజులుగా ఇంటికి సమీపంలో ఉండే గంగరాజుకు, సదానందంకు మధ్య ప్రహరీ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి సదానందం తన ఇంట్లో నుండి AK 47 గన్ తీసుకొచ్చి గంగరాజుపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. మిస్ ఫైర్ కావడంతో గంగరాజు ప్రాణాలతో బయటపడ్డాడు. కాల్పుల అలజడికి చుట్టుపక్కల వారు రావడంతో సదానందం పరారయ్యాడు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు రెండు కాళీ తూటాలు, మరొక వాడని తూటాను స్వాధీనం చేసుకున్నారు. సదానందం ఇంటి నుండి ఒక డాగర్, గన్ బెల్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. గంగరాజు ఇంటికి వచ్చే ముందు సదానందం AK 47తో తన ఇంటి ముందు కాల్పులు చేసి పరీక్షించాడు. కాల్పుల కారణంగా ఇంటి ముందు గొయ్యి ఏర్పడింది.
సంఘటన స్థలంలో దొరికిన బుల్లెట్ ఆధారంగా సదానందం వద్ద ఉన్నది AK 47 అని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సదానందం కోసం మూడు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి గాలింపు మొదలు పెట్టారు. అయితే, పరారీలో ఉన్న సదానందం నిన్న సాయంత్రం కోహెడ పోలీసులకు ఆయుధంతో సహా లొంగిపోయినట్టు తెలుస్తోంది.
అసలు సదానందంకు AK 47 ఎలా వచ్చిందన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తే నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. మూడేళ్ల క్రితం హుస్నాబాద్ పీఎస్ నుంచి ఏకే 47, 2 కార్బన్ గన్లు మాయమయ్యాయి. ఇప్పుడు సదానందం దగ్గర ఉన్న ఏకే 47 అదేనా అని పోలీసులు అనుమానిస్తున్నారు. అదే అయితే సదానందం దగ్గరకు గన్ ఎలా వచ్చింది...?
అక్కన్నపేట కాల్పుల ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కాల్పులు జరిపిన సదానందానికి మావోయిస్టులతో సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మూడేళ్ల క్రితం హుస్నాబాద్ పీఎస్ నుంచి ఏకే 47, 2 కార్బన్ గన్లు మాయమయ్యాయి. అప్పట్లో ఓ సీఐ, మరో కానిస్టేబుల్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. మావోయిస్టులతో సంబంధాలున్న నేపధ్యంలో సదానందం దగ్గర ఉన్న ఏకే 47 అదేనా అని అనుమానిస్తున్నారు.
అయితే, గ్రామస్తులు మాత్రం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో ఆయుధాలు మిస్ అయిన సమయంలో తన కుటుంబ సభ్యుల కేసు విషయమై సదానందం తరచూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లేవాడని, అక్కడున్న పోలీసులతో పరిచయాన్ని పెంచుకుని, ఆయుధాలను దొంగిలించినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అసలు మామూలు రివాల్వర్ వాడాలంటేనే కనీస పరిజ్ఞానం ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అలాంటప్పుడు AK 47 వాడలంటే కనీస శిక్షణ తప్పనిసరి. మరి సదానందం ఎలాంటి శిక్షణ లేకుండా AK 47ను ఎలా ఆపరేట్ చేశారన్నది మిస్టరీగా మారింది. మరోవైపు సదానందం 9వ తరగతి చదువుతున్నప్పుడు ఏడేళ్లపాటు అదృశ్యమయ్యాడని, ఆ సమయంలో మావోయిస్టులతో కలిసి వెళ్లి, ఆయుధాల వాడకంపై శిక్షణ పొందినట్టు తెలుస్తోంది.
సిద్దిపేట, హుస్నాబాద్ ఏసీపీలు, క్లూస్ టీం సహాయంతో సదానందం ఇంటిని తనిఖీ చేశారు. పేలిన తూటాలను స్వాధీనం చేసుకున్నారు. తల్వార్ కత్తి, తుపాకి బెల్ట్, బాడిషా కత్తి, రెండు ఫోన్లు, రెండు బ్యాంక్ అకౌంట్ల ఏటీఎంలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.