కరీంనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థినిని గుర్తు తెలియని వ్యక్తి గొంతుకోసి హతమార్చాడు. విద్యార్థిని తల్లిదండ్రులు రోజు కూలీలుగా పనిచేస్తున్నారు. సాయంత్రం వారు ఇంటికి వచ్చి చూసేసరికి రక్తపుమడుగులో కుమార్తె పడి ఉండటం చూసి తీవ్ర ఆవేదనకు గురై బోరున విలపించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అయితే దుండగుడు ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.
కరీంనగర్‌లో ఇంటర్ విద్యార్థిని హత్య కలకలం రేపింది. ఆమెను గొంతుకోసి దారుణంగా హతమార్చిందెవరన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో రాధిక ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. కాళ్లు కూడా సరిగ్గా సహకరించకపోవడంతో పరీక్షలకు ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అవుతోంది. తల్లిదండ్రులు కూలిపని కోసం బయటకు వెళ్లిన సమయంలో పక్కా స్కెచ్ వేసిన దుండగుడు రాధికపై దాడి చేశాడు. హత్య అనంతరం పక్కా వ్యూహంతో ఎలాంటి ఆధారాలు దొరక్కుండా క్లీన్ చేశాడని పోలీసులు చెబుతున్నారు. డాగ్ స్క్వాడ్ కూడా పసిగట్టేందుకు వీల్లేకుండా ఇల్లు మొత్తం నీటితో కడిగేశాడని అంటున్నారు.
విద్యార్థిని హత్య సమాచారాన్ని తెలుసుకున్న మంత్రి గంగుల కమలార్.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. హంతకులు ఎవరైనా వదిలిపెట్టేంది లేదని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే, తమకు శత్రువులెవరూ లేరని, ఇంట్లో అద్దెకు ఉన్నవారిపైనే అనుమానం ఉందని రాధిక తల్లిదండ్రులు చెబుతున్నారు. రాధిక హత్యకు కారణం ప్రేమ వ్యవహారమా..? లేక దోపిడి దొంగల పనా అన్నది పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. రాధిక సెల్ ఫోన్ ఆధారంగా హంతకుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.