పాపం.. చిట్టితల్లి !

సామాజికంగా, సాంకేతికంగా అభివృద్ది చెందుతున్న దేశంలో, మగవారికి ధీటుగా ఆడపిల్లలు కూడా ఉంటున్నారు. అయినప్పటికీ సమాజంలో కొంతమందికి ఆడపిల్లలంటే చిన్నచూపే. గర్భంలో వుంది ఆడపిల్ల అని తెలియగానే కొంతమంది భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు.

Update: 2019-10-16 09:53 GMT

సామాజికంగా, సాంకేతికంగా అభివృద్ది చెందుతున్న దేశంలో, మగవారికి ధీటుగా ఆడపిల్లలు కూడా ఉంటున్నారు. అయినప్పటికీ సమాజంలో కొంతమందికి ఆడపిల్లలంటే చిన్నచూపే. గర్భంలో వుంది ఆడపిల్ల అని తెలియగానే కొంతమంది భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. మరికొంతమంది పుట్టింది ఆడపిల్ల అని తెలియగానే ఆ పసికందులని చెత్తకుప్పల్లోనో, కాలువల్లోనో వొదిలేస్తున్నారు. ప్రభుత్వాలు బేటి బచావో, బేటి పడావో లాంటి నినాదాలు చేస్తున్నా. కళ్యాణలక్ష్మి లాంటి పథకాలు అమలు చేస్తున్నా, భ్రూణ హత్యల నివారణకు ఎన్ని చట్టాలు వస్తున్నా నేరాలు మాత్రం ఆగడం లేదు.

ఏ రాష్ట్రంలో చూసినా ఆడపిల్ల పుట్టిందంటే చాలు గుండెల మీద కుంపటి లాగానే భావిస్తున్నారు. కనీసం కళ్ళు కుడా తెరవక మూడే వారిని తల్లి ఒడి నుండి దూరం చేస్తున్నారు. ఇలాంటి ఒక సంఘటన హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చింది.

అప్పుడే పుట్టిన ఆడ శిశువును కనికరం కూడా లేకుండా చెత్తకుప్పలో పడేశారు కసాయి తలిదండ్రులు. ఈ ఘటన నిమ్స్‌ ఆస్పత్రి ఆవరణలో బుధవారం చోటు చేసుకుంది. శిశువు ఏడుపు విన్న స్థానికులు ఆ పరిసర ప్రాంతాలు గాలించారు. చెత్తకుప్పలో శిశువు వున్నట్టు గమనించారు. వెంటనే వైద్యులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న వైద్యులు చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. ఆడబిడ్డ కావడంతోనే ఆ శిశువును అక్కడే వదిలేసి వెళ్లిపోయి ఉంటారని వైద్యులు, స్థానికులు భావిస్తున్నారు. ఆ బిడ్డని ఎవరు వదిలివెల్లారో అనే సమాచారం కోసం ఆస్పత్రి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీలను నిమ్స్‌ సిబ్బంది పరిశీలిస్తున్నారు.


Tags:    

Similar News