గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. నయీం కేసు వివరాలు ఇవ్వాలని ఆర్టీఐ కింద ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దరఖాస్తు చేసింది. ఈ దరఖాస్తుకు స్పందించిన ఆర్టీఐ నయీం కేసు వివరాలు వెల్లడించింది. నయీంతో కలిసి అధికార, ప్రతిపక్ష, పోలీసులు అక్రమ దందాలు చేసినట్లు ఆర్టీఐ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నయీం కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.. నయీం కలిసి రాజకీయ నాయకులు, పోలీసులు అక్రమ దందాలు చేసినట్లు వెల్లడైంది. నయీం దాదంలకు రాజకీయ పార్టీల నేతలు, పోలీసుల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది.. ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థ దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం దరఖాస్తుతో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నయీంతో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, పోలీసులకు సంబంధాలు ఉనట్లు పోలీస్ ఐజీ సిట్ అధికారి నాగిరెడ్డి లిఖిత పూర్వకంగా తెలిపారు.
నయీంతో సంబంధం ఉన్న తొమ్మిది మంది రాజకీయ నేతలు, పాతిక మంది పోలీసు అధికారులు, సిబ్బంది పేర్లను వెల్లడించారు.. అదనపు ఎస్పీ మొదలు సాధారణ కానిస్టేబుల్ వరకు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. కేసు దర్యాప్తు జరుగుతున్నందున మరికొన్ని వివరాలను ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. రాజకీయ నేతల్లో ఒక్కరు మినహా మిగిలినవారంతా అధికార పార్టీలోనే ఉన్నట్లు పేర్కొన్నారు.
నయీంతో మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, పలువురు మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, అడిషనల్ ఎస్పీలు, శ్రీనివాసరావు, చంద్రశేఖర్, అమరేందర్‌రెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్, సాయి మనోహర్‌రావు, శ్రీనివాసరావు, ప్రకాశ్‌రావు, వెంకటనర్సయ్య పేర్లు ఉన్నాయి. అంతే కాదు.. ఈ కేసులో పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న, ఇన్‌స్పెక్టర్లు మస్తాన్, శ్రీనివాసరావు, మాజీద్, వెంకట్‌రెడ్డి, వెంకటసూర్యప్రకాశ్, రవికిరణ్‌రెడ్డి, బల్వంతయ్య, బాలయ్య, రవీందర్, నరేందర్‌గౌడ్, దినేష్, సాదిఖ్‌మియా పేర్లు కూడా ఉన్నట్లు ఆర్టీఐ తెలిపింది. మొత్తానికి ఇప్పటి వరకూ నత్తనడకన సాగిన సిట్ విచారణ ఇక నుంచైనా స్పీడ్ అందుకుంటుందా? ఆర్టీఐ లో వెల్లడించిన వారిని విచారణ చేసిందా అనేది స్పష్టత రావాల్సి ఉంది.