వాచ్‌మెన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అడుగు పెట్టి దెబ్బతిన్నాడు. అడ్డదారిలో డబ్బు సంపాదించాలనుకున్నాడు. కాసుల కోసం ప్రాణాలు తీయడం మొదలు పెట్టాడు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు 20 నెలల్లో 10మందిని సైనైడ్ కలిపిన ప్రసాదం ఇచ్చి చంపాడు. హంతకుడు శివతో పాటు సహకరించిన మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు.
భక్తి , రైస్ పుల్లింగ్, గుప్తనిధుల పేరిట కొందరికి , బంగారం రెట్టింపు చేస్తానంటూ మరికొందరికి శివ ముఠా వలవేసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పేపర్ మిల్లు వద్ద ఉంటున్న రాఘవమ్మ వద్దకు చుట్టపు చూపుగా సింహాద్రి అలియాస్ శివ వెళ్లాడు. వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న రాఘవమ్మను ఆయుర్వేదంతో బాగు చేస్తానని నమ్మించాడు. ఆమెకు ఇచ్చే మందుల్లో సైనైడ్ కలిపి చంపేశాడు. ఆమె ఇంట్లో నుంచి లక్ష రూపాయలకు పైగా నగదు ఉడాయించాడు.
ఏలూరు కేబీడీటీ హైస్కూల్‌లో వ్యాయమ ఉపాధ్యాయునిగా పని చేస్తున్న కాటి నాగరాజు రైస్ పుల్లింగ్ కాయిన్ కోసం తెలిసిన వారినల్లా సంప్రదిస్తున్నాడు. ఎవరో శివ గురించి చెప్పగా వెళ్లి కలిశాడు. ఆ కాయిన్ ఇస్తానని గత నెల 16న తన వద్దకు పిలిపించుకున్నాడు. అతడు చెప్పినట్లు నాగరాజు రెండు లక్షల నగదు, నాలుగున్నర కాసుల బంగారం నగలు పట్టుకుని ఇంటి నుంచి వెళ్లాడు. ఏలూరు సమీపంలోని వట్లూరి మినీ బైపాస్ రోడ్డులో శివను కలుసుకున్నాడు. నాగరాజుకు ప్రసాదం అంటూ సైనైడ్ పెట్టాడు. ఆ ప్రసాదం తిన్న నాగరాజు మృతి చెందాడు. అతని వద్ద నుంచి నగదు, బంగారం ఆభరణాలు శివ అపహరించుకుపోయాడు.
ఇలాగే 2018 ఫిబ్రవరిలో నూజీవీడుకు చెందిన వల్లభనేని ఉమామహేశ్వరరావు, 2018 మార్చిలో ఆగిరిపల్లికి చెందిన గండికోట భాస్కర్ రావును, అదేనెలలో గన్నవరానికి చెందిన కడియం బాల వెంకటేశ్వరరావు, ఏప్రిల్‌లో ఏలూరు వంకాయగూడెంకు చెందిన చోడవరపు సూర్యనారాయణ, రాజమండ్రికి చెందిన రామకృష్ణ స్వామిజీని, కుర్తి నాగమణి, తాను అద్దెకు ఉంటున్న ఓనర్ రావులమ్మలను వరుసగా పదిమందిని సైనైడ్ ఇచ్చి ప్రాణాలు తీసి వారి వద్ద డబ్బు, నగలు దోచుకున్నాడు.
మృతుల బంధువులు ఇచ్చిన వివరాల ఆధారంగా ఎట్టకేలకు శివను , అమానుల్లాను ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు. శివ వద్ద నుండి సైనైడ్ , 23 కాసుల బంగారు ఆభరణాలు, లక్షా 63వేల 400 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. హంతకుడు గత 20 నెలల్లో కృష్ణా జిల్లాలో నలుగురిని, ఉభయ గోదావరి జిల్లాలో ఆరుగురిని కిరాతకంగా హత్య చేశాడు. ఇతర జిల్లాలో నిందితులపై కేసులు ఉండటంతో పోలీసులు కస్టడీకి కోరనున్నారు.