సులువుగా డబ్బు వచ్చేస్తుందని అత్యాశకు పోతే నిలువునా ములిగిపోవడం ఖాయం. ఎన్నిసార్లు ఇటువంటి సంఘటనలు జరిగినా ఇంకా కొంతమంది తెలుసుకోలేకపోవడమే ఘోరం. రైస్ పుల్లింగ్, ఇరిడియం ఇలా రకరకాలుగా చెప్పి ప్రజల్ని మోసం చేసే వాళ్ళు రోజురోజుకూ ఎక్కువవుతున్నారు. ఇదిగో ఇటీవల ఇదేవిధంగా మోసానికి పాల్పడిన వాళ్లను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.
మొదట లక్షల్లో అప్పు చేశాడు. అప్పు తీర్చమని అడిగితే మంచి వ్యాపారం ఉందని చెప్పాడు. రైస్ పుల్లింగ్.. ఇరిడియం అని కథలు చెప్పి నమ్మించాడు. తరువాత మరిన్ని లక్షలు అతని దగ్గర నుంచి వ్యాపారం పేరుతొ లాగేశారు. ఆనక బిచాణా ఎత్తేశారు. ఈ ఉదంతంలో ఓ వ్యాపారిని మోసం చేసి రూ.32లక్షలు కాజేసిన వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టుచేశారు. నిందితుడి నుంచి రూ. 18లక్షలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. బుధవారం గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు, ఏసీపీ శ్యాంప్రసాద్‌రావు, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణలు వివరాలను వెల్లడించారు.
ఇదీ జరిగింది..
మహారాష్ట్ర బాంద్ర వెస్ట్ ప్రాంతానికి జితేష్ శాంతిలాల్ సొలంకి స్థానికంగా స్టీల్ వ్యాపారం చేస్తున్నారు. ఇదే ప్రాంతానికి చెందిన సమీర్‌రాయ్‌కు కొంతకాలం కిందట రూ.10లక్షలు అప్పుగా ఇచ్చాడు. ఆ డబ్బు తిరిగి ఇవ్వాల్సిందిగా ఇటీవల జితేష్ సమీర్‌ను కోరాడు. తాను ఇటీవలే రైస్‌పుల్లింగ్ యంత్రం ఒకటి విక్రయించానని, ఇందుకుగాను తనకు రూ.300 కోట్లు రావాల్సిఉందని చెప్పాడు. డబ్బు వచ్చిన వెంటనే అప్పు చెల్లిస్తానన్నాడు. ఆ యంత్రం కోనుగోలు చేస్తే అందులో నుంచి ఉత్పత్తి అయ్యే ఇరేడియం విక్రయిస్తే రూ.కోట్లు వస్తాయని జితేష్‌కు మాయమాటలు చెప్పాడు. ఇదే క్రమంలో సమీర్ ముంబాయికు చెందిన తన స్నేహితుడు రాజ్‌ఖాన్‌ను జితేష్ శాంతిలాల్‌కు పరిచయం చేశాడు. రాజ్‌ఖాన్ వద్ద సదరు యంత్రం ఉందని, దాన్ని పరీక్షించి విక్రయిస్తే రూ.కోట్లు వస్తాయని జితేష్‌ను నమ్మించారు. వైజాగ్‌కు చెందిన తన స్నేహితుడు సింగపల్లి వాసు అలియాస్ దేవా(35) సదరు యంత్రాన్ని పరీక్షిస్తాడని, అతను శాస్త్రవేత్త అని పరిచయం చేశారు. దేవా కూడా తాను శాస్త్రవేత్తనంటూ జితేష్‌ను నమ్మించాడు. అనంతరం ఆ యంత్రాన్ని డీఆర్‌డీవో పరిశోధన కేంద్రంలో పరీక్షించిన తరువాత ఓ బడా కంపెనీకి విక్రయించాలని, ఇందుకు దాదాపు రూ.3.26 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఇందులో భాగంగా రాజ్‌ఖాన్, దేవాలు కలిసి ఈ ఏడాది జనవరిలో గోవాలోని ఓ స్టార్ హోటల్‌లో సమావేశం నిర్వహించి జితేష్‌ను అక్కడికి రప్పించారు. రూ.3.26 కోట్లలో తాను రూ.1.63 లక్షలు పెట్టుబడి పెడతాని దేవా చెప్పగా తన వాటాగా రాజ్‌ఖాన్ రూ.1.10 కోట్లు ఇస్తానన్నాడు. వారి మాటలను నమ్మిన జితేష్ తన వాటాగా రూ.52లక్షలు ఇస్తానన్నాడు. దీంతో ముగ్గురు డబ్బును సర్దుబాటు చేసుకొని ఈ నెల ఒకటిన హైదరాబాద్‌లో కలసుకోవాలని నిర్ణయించుకున్నారు. జితేష్ ఈ నెల ఒకటిన గచ్చిబౌలిలోని ఆదిత్యఇన్ హోటల్‌కు వచ్చాడు. అక్కడ రాజ్‌ఖాన్, దేవాలు జితేష్‌ను కలిసి అతని వద్ద రూ.32లక్షలు తీసుకున్నారు. ఒకటిరెండు రోజుల్లో రైస్‌పుల్లింగ్ యంత్రం పరీక్షలు పూర్తి చేసి విక్రయిస్తామని తెలిపారు. మిగితా రూ.20లక్షలు కూడా ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేశారు. తరువాత వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు ఈనెల 6న గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల్లో దేవాను బుధవారం అరెస్టు చేసి అతని వద్ద రూ.18లక్షలు, ఒక ల్యాప్‌టాప్, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు రాజ్‌ఖాన్, సమీర్‌రాయ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన డీఐ సత్యనారాయణతోపాటు సిబ్బందిని డీసీపీ అభినందించారు.