హైదరాబాద్ లో కత్తిపోట్లకు గురైన వ్యాపారి రాంప్రసాద్ ఈ తెల్లవారుజామున మృతి చెందారని పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి పంజాగుట్ట వేంకటేశ్వర ఆలయం దైవదర్శనం చేసుకొని వెళ్తుండగా కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు మాటువేసి కత్తులతో అతడిపై దాడి చేశారు. ఈ ఘటనలో రాంప్రసాద్ పొట్టపై తగలకుండా చేతులతో అడ్డుకున్నారు. దీంతో తలకు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో అతడిని సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారని ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.
రాంప్రసాద్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇతనికి విజయవాడలో స్టీల్‌ప్లాంట్ ఉందని అక్కడ గతంలో కోగంటి సత్యం అనే వ్యాపార భాగస్వామితో పాతకక్షలున్నాయని కుటుంబీకులు తెలిపారు.అతడి నుంచి తరచూ బెదిరింపులు వచ్చేవని.. ఆయనే కిరాయి హంతకులతో హత్య చేయించి ఉంటారని కుటుంబీకులు భావిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న, ఇన్‌స్పెక్టర్ మోహన్, ఎస్సై శ్రీనివాసులు, సతీశ్‌కుమార్, చంద్రశేఖర్, పశ్చిమమండలి టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.