బ్యాంకుల్ని ముంచేయడం.. ఆనక బోర్డు తిప్పేయడం దర్జాగా జరిగిపోతోంది ఈమధ్య. చిన్న, చిన్న రుణాలు తీసుకున్న వారు, రైతులు వంటి వారిని ఒక్క వాయిదా ఆలస్యం అయితే రకరకాలుగా హింసించే బ్యాంకులు డొల్ల వ్యాపారస్తులకు కోట్లాది రూపాయల రుణాలు ఇచ్చేయడం.. వారు కొన్ని రోజులకు చేతులెత్తి విదేశాలకు చెక్కేయడం పరిపాటిగా మారిపోయింది. మొన్న విజయమాల్యా.. నిన్నటికి నిన్న నీరవ్ మోడీ.. ఇప్పుడు తాజాగా భూషణ్ పవర్ అండ్ స్టీల్ కంపెనీ ఆ లిస్టులో చేరింది. ఈ కంపెనీ ముంచేసింది కూడా నీరవ్ మోడీ ముంచేసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ నే కావడం గమనార్హం.
భూషణ్ పవర్ అండ్ స్టీల్ కంపెనీ పంజాబ్ నేషనల్ బ్యాంకును రు. 3,800 కోట్ల మేర మోసగించిందని..స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్ లో పీఎన్బీ వెల్లడించింది. ఇదే విషయాన్ని ఆర్బీఐకి కి కూడా తెలిపింది.
చండీగఢ్ లోని కార్పొరేట్ బ్రాంచ్ ద్వారా దాదాపు రూ. 3,200 కోట్లు, దుబాయ్ లోని బ్రాంచ్ ద్వారా రూ. 345 కోట్లు, హాంగ్ కాంగ్ బ్రాంచ్ ద్వారా రూ. 268 కోట్లను ఇచ్చినట్టు పీఎన్బీ వెల్లడించింది. గత వారంలో భూషన్ స్టీల్ ప్రమోటర్లు, ఆడిటర్లు, ఇండిపెండెంట్ డైరెక్టర్లపై ఢిల్లీలోని ఓ కోర్టుకు 70వేల పేజీల నివేదికను సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) అందజేసింది. భూషన్ స్టీల్ పై సీబీఐ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.