జనం సొమ్ముతో జల్సాలు చేస్తూ విందు, వినోదాలు, బెట్టింగ్ ల్లో మునిగి తేలుతున్న ఎస్‌బీఐ క్యాషియర్ అవినీతి బాగోతాన్ని పోలీసులు వెలికి తీస్తున్నారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల స్టేట్ బ్యాంక్ శాఖలో నకిలీ ఖాతాలు సృష్టించి గుడవర్తి శ్రీనివాసరావు అనే క్యాషియర్ 80.85 లక్షలు స్వాహా చేసినట్లు గుర్తించిన అధికారులు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రీనివాసరావు నడిపించిన కథ వెనుక కూపీ లాగుతున్నారు.
ముఖ్యంగా బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకునేందుకు వచ్చిన వారినే శ్రీనివాసరావు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రాథమికంగా నిర్థారించారు. రుణం కోసం వచ్చిన వారితో తెలివిగా రెండు సెట్ల పేపర్లపై సంతకాలు చేయించుకునే వాడు. అనంతరం రెండుసార్లు రుణం తీసుకుని ఒకటి తన ఖాతాకు జమ చేసుకునేవాడు. ఇలా కాజేసిన మొత్తాన్ని సార్వత్రిక ఎన్నికల బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్‌లో పెట్టినట్లు గుర్తించారు. అలాగే కొంతమొత్తం విందు, వినోదాలకు ఖర్చుచేసినట్లు తేల్చారు.
బ్యాంకును మోసం చేయడమేకాక బయట వ్యక్తుల వద్ద కూడా శ్రీనివాసరావు భారీగా అప్పులు చేసి బెట్టింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది. నేరుగా ఖాతాదారుల ఇళ్లకే వెళ్లి బంగారంపై రుణం తీసుకోవాలని ఒత్తిడి చేయడం, కొందరి ఖాతాదారుల నుంచి సంతకాలు, స్టాంపులు, ఫొటోలు కూడా తీసుకోకుండానే రుణం మంజూరు చేసినట్లు గుర్తించారు. బెట్టింగ్‌ల్లో పెట్టిన సొమ్ముపై లాభాలు వస్తే ఇలా నొక్కేసిన ఖాతాదారుల సొమ్ము మెల్లగా తీర్చేయవచ్చునన్న అతని వ్యూహం ఫలించలేదు.నిండా అప్పుల్లో కూరుకుపోయాడు. ఈలోగా శ్రీనివాసరావు చేస్తున్న అవకతవకలను గుర్తించిన ఉన్నతాధికారులు నిలదీయడంతో పొరపాటు జరిగిందని, రూ.19 లక్షలు చెల్లించేస్తానని చెప్పడంతో కొన్నాళ్లు ఊరుకున్నారు. అయినా అతను మాట నిలబెట్టుకోలేక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరావును ఈరోజు పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.