పదివేల అప్పు తీర్చలేదని కర్కశంగా కడతేర్చాడు!

Update: 2019-10-08 07:34 GMT

కేవలం పదివేల రూపాయల అప్పు తీర్చలేకపోయినందుకు ఒక మహిళను దారుణంగా హత్య చేశాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన కర్నూలు లో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కర్నూలుకు చెందిన మంగలి విజయలక్ష్మి అలియాస్‌ లక్ష్మి(30) మొదటిభర్తతో తెగదెంపులు చేసుకుని ఆరేళ్ళ క్రితం పాణ్యం మండలం తమ్మరాజుపల్లెకు చెందిన సందేలు అంజిని రెండో వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తే ఉంది.

కొంత కాలం క్రితం అవరం పడి లక్ష్మి కుందేలు బాలు అలియాస్ కంసలిబాబు అనే ఆటోడ్రైవర్ వద్ద రూ.10వేల అప్పు తీసుకుంది. అయితే, ఈ అప్పును తీర్చలేక ఇబ్బందులు పడుతోంది. కొన్ని రోజులుగా ఆటోడ్రైవర్ తన అప్పు తీర్చమని గొడవ చేయసాగాడు. కొద్దిరోజుల్లో తీర్సుస్తామని చెబుతూ వచ్చింది లక్ష్మి. ఆదివారం రాత్రి లక్ష్మి, ఆమె భర్త, కుదేలు బాబు కలిసి కల్లు దుకాణంలో కల్లు తాగారు. ఈ సందర్భంగా కుందేలు బాబు మళ్లీ తన అప్పు తీర్చమని అడిగాడు. ఇవ్వకపోతే బాగోదని బెదిరించాడు. దీంతో లక్ష్మి ఇప్పుడు ఆ అప్పు తీర్చలేంని చెప్పి అక్కడ నుంచి భర్త తో కల్సి వెళ్ళిపోయింది.

బస్టాండ్ వరకూ వెళ్ళిన వారికి బాబు ఫోన్ చేసి పనివుంది ఒకసారి వెనక్కి రమ్మని పిలిచాడు. దీంతో వారిరువురు ఆటోలో కల్లు దుకాణం వద్దకు వెళ్ళారు. అక్కడ ఆటో దిగుతున్న సమయంలో బాబు కత్తితో లక్ష్మి పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ సమయంలో భయంతో లక్ష్మి భర్త అక్కడ నుంచి పారిపోయాడు. తీవ్ర గాయాల పాలైన లక్ష్మిని దగ్గరలో ఉన్న ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకు వెళ్ళారు. అయితే, అక్కడ వారు వైద్యం చేయడానికి నిరాకరించడంతో స్థానికులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావంతో లక్ష్మి అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. భర్త ఫిర్యాదు మేరకు కంసలిబాబుపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మూడో పట్టణ పోలీసుస్టేషన్‌ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. కంసలి బాబు గతంలో అనేక చోరీలు, హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.


Tags:    

Similar News