రెండు లక్షల కోసం ప్లాన్ వేసింది.. అడ్డంగా బుక్కయింది!
ప్రభుత్వ పధకాన్ని కాజేయాలని ఆశపడిన ఓ మహిళ వితంతువుగా మారింది. విషయం పసిగట్టిన అధికారులు ఆమె పై కేసు నమోదు చేశారు.
కొన్ని ప్రభుత్వ పథకాలతో భలే చిక్కులు వస్తాయి. సహజంగానే ఏదైనా ఉచితంగా వస్తోందంటే..దానిని సాధించడానికి ప్రయత్నిస్తారు. దానికోసం కొంత త్యాగం చేయడానికీ సిద్ధం అవుతారు. ఇక డబ్బుతో ముడిపడిన వ్యవహారం అయితే, అవసరమైతే ఎంత పని అయినా చేయడానికి కొందరు సిద్ధం అయిపోతారు. ఈ సంఘటన కూడా అటువంటిదే. రెండు లక్షల కోసం తాను వితంతువుని అని చెప్పుకుందో మహిళ. సాధారణంగా భారత దేశంలో వితంతువు అనిపించుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ, ఈ మహిళ డబ్బుకోసం ఆపనికి సిద్ధపడింది. విషయం బయటపడి జైలు పాలైంది. మధ్యప్రదేశ్ లో చోటుచేసుకున్న్ ఈ సంఘటన వివరాలివీ..
మధ్యప్రదేశ్ ప్రభుత్వం 'ముఖ్యమంత్రి కల్యాణీ వివాహ్ సహాయతా యోజన' కింద వితంతువులు పునర్వివాహం చేసుకుంటే 2 లక్షలు కానుకగా ఇచ్చేందుకు ఓ పధకాన్ని అమలు చేస్తోంది. దీంతో గ్వాలియర్‌లోని సంజయ్ నగర్‌కు చెందిన భీమ్‌శరణ్ గౌతమ్ భార్య చాందినీ గౌతమ్ ఆ పథకం నుంచి లబ్ది పొందడానికి మంచి ప్లాన్ వేసింది. తన భర్త చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ పుట్టించింది. తరువాత అతనినే మళ్లీ వివాహం చేసుకున్తున్నాట్టు అధికారులకు దరఖాస్తు చేసింది. దరఖాస్తు పరిశీలనలో అధికారులకు అనుమానం వచ్చింది. తీగ లాగారు విషయం బయటకు వచ్చింది. నకిలీ సర్టిఫికేట్లతో ప్రభుత్వాన్ని మోసం చేద్దామనుకుందని పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేశారు. స్థానికంగా ఈ విషయం సంచలనం రేకెత్తించింది.