చనిపోయాడని అంత్యక్రియలు చేసిన వ్యక్తి తిరిగొస్తే!

Update: 2019-05-12 08:46 GMT

ఒక్కోసారి నిజాన్ని కూడా నమ్మడానికి చాలా సమయం పడుతుంది. ఎదురుగా స్పష్టంగా కనిపిస్తున్నా కళ్లప్పగించి చూస్తూఉండిపోతాం. అందులోనూ లేదనుకున్న మనిషి.. ఇక రాలేదనుకున్న వ్యక్తి అకస్మాత్తుగా ప్రత్యక్షమైతే.. చనిపోయాడనుకుని అంత్యక్రియలు కూడా నిర్వహించిన వాడు అకస్మాతుగా ప్రత్యక్షమైతే ఎలా ఉంటుందో ఊహించడానికి కూడా కష్టమే. సరిగ్గా ఇలాంటి సంఘటన అనంతపురం జిల్లా చెన్నైకొత్తపల్లి మండలం హరేన్‌చెరువు గ్రామంలో చోటు చేసుకుంది. రెండేళ్ల క్రితం చనిపోయాడని భావించి గుర్తు తెలియని శవాన్ని తమ వాడిదిగానే భావించి అంత్యక్రియలు జరిపించిన తరువాత హఠాత్తుగా నేనున్నానని తిరిగి వచ్చాడు. దీనితో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.

వివరాల్లోకి వెళితే...గ్రామానికి చెందిన తలారి శ్రీనివాసులు (38) రెండేళ్ల క్రితం అంటే 2017 మార్చి 19న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అతని ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో తండ్రి ముత్యాలప్ప మార్చి 24వ తేదీన తన కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు.

వారం రోజుల తర్వాత గొల్లపల్లి మండలం పెనుగొండ జలాశయంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. ఆ మృతదేహం శ్రీనివాసులదేమోనన్న అనుమానంతో పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి అది శ్రీనివాసులదేనని చెప్పడంతో పంచనామా పూర్తిచేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారు శవాన్ని గ్రామానికి తీసుకువచ్చి ఖననం చేసి అంత్యక్రియలు పూర్తి చేశారు.

కాగా, నాలుగు రోజుల క్రితం శ్రీనివాసులు ధర్మవరం పట్టణంలోని రైల్వేస్టేషన్‌ సమీపంలో సంచరిస్తుండగా హరేన్‌ చెరువు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గమనించి గ్రామస్థులు, పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి శ్రీనివాసులును తీసుకువచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ తన పరిస్థితి బాగాలేక ఊరు వదిలి వెళ్లిపోయానని చెప్పాడు.

ఈ ఘటనపై శ్రీనివాసులు భార్య చిలుకమ్మ మాట్లాడుతూ రెండేళ్ల క్రితం జలాశయంలో లభించిన మృతదేహం తన భర్తది కాదని అప్పట్లో తాను చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని, తప్పని పరిస్థితుల్లో మృతదేహాన్ని తెచ్చి ఖననం చేశామని కన్నీటిపర్యంతమవుతూ చెప్పింది. దీంతో శ్రీనివాసులు మిస్సింగ్‌ కేసు పరిష్కారమైనా అప్పట్లో రిజర్వాయర్‌లో లభించిన మృతదేహం ఎవరిదన్న ప్రశ్న మొదలయ్యింది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టుగా బతికొచ్చిన శ్రీనివాసులు ఇపుడు పోలీసులకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాడు. 

Similar News