పెళ్లి రోజే ఆ కుటుంబంలో విషాదం
పెళ్లి రోజే ఆ దంపతులకు చివరి రోజు అయ్యింది. కుటుంబంతో దైవ దర్శానికి బయలుదేరి తిరిగిరాని లోకలకు వెళ్లిపోయారు. అప్పటి వరకు సంతోషంగా ప్రయాణం సాగించిన కుటుంబంలో విషాదం నిండుకుంది.
పెళ్లి రోజే ఆ దంపతులకు చివరి రోజు అయ్యింది. కుటుంబంతో దైవ దర్శానికి బయలుదేరి తిరిగిరాని లోకలకు వెళ్లిపోయారు. అప్పటి వరకు సంతోషంగా ప్రయాణం సాగించిన కుటుంబంలో విషాదం నిండుకుంది. నిన్న కరీంనగర్– హైదరాబాద్ రోడ్డులో శామీర్‌పేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం జీవితాలను చిదిమేసింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బండ్లగూడకు చెందిన నాగోల్ ఓబీసీ మోర్చ అధ్యక్షుడు కోసూరి కిషోర్ చారీ.. ఆయన భార్య భారతి, ఇద్దరు కుమారులు సుధాన్స్, తనిష్‌తో కలిసి సిద్దిపేట జిల్లా వర్గల్ దేవాలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దచెరువు సమీపంలో వీరి కారు వేగంగా వెళ్తూ.. డివైడర్‌ను ఢీ కొట్టింది. వేగం ఎక్కువగా ఉండడంతో గాల్లోకి ఎగిరి అవతలి రోడ్డులో గజ్వేల్‌కు వెళ్తున్న మారుతి సుజుకీ ఎర్టిగా కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఈ ప్రమాదంలో ఎకోస్పోర్ట్ వాహనంలోని కిశోర్ చారి, ఆయన భార్య భారతి, పెద్దకుమారుడు సుధాంశ్‌లు అక్కడిక్కడే మృతి చెందగా, చిన్న కుమారుడు తనిష్‌తో పాటు ఎదురుగా వస్తున్న ఎర్టిగా కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రెండు కార్లు ధ్వంసమయ్యాయి మృతదేహాలు కారులోనే ఉండటంతో స్థానికుల సాయంతో వీటిని బయటకు తీశారు. అతి వేగం ప్రమాదాలకు కారణమవుతోన్న ప్రజల్లో మార్పు రావడం లేదు. గతంలో రాజకీయ నాయకులు కుమారులు, సామాన్య ప్రజలు సైతం వేగంగా వాహనాలు నడపడం వల్ల అవి అదుపుతప్పి ప్రమాదాల బారిన పడ్డారు. ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. తాజాగా అతి వేగం మరో కుటుంబాన్ని చిదిమేసింది.కిషోర్, ఆయన భారతి, కుమాడురు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో నాగోల్ బీజేపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. కాసేపట్లో ఉస్మానియాలో వీరి మృతదేహాలకు పోస్టు మార్టం నిర్వహించనున్నారు. మరోవైపు ప్రమాదంలో గాయపడిన ముగ్గురికి చికిత్స అందుతోంది.