మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం:13 మంది మృతి

Update: 2019-08-05 03:00 GMT

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిర్లక్ష్యంగా, వేగంగా లారీని నడిపిన డ్రైవర్.. పొలం పనుల నుంచి కూలీలను తరిగి తీసుకువెళుతున్న ఆటోని ఢీ కొట్టాడు. దీంతో పన్నెండు మంది అక్కడిక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం కొత్తపల్లి, గోగ్యాతండాకు చెందిన 17 మంది అదే మండలంలోని వాడ్యాలకు పొలం పనులకు వెళ్లారు. వరినాట్లు వేసి, సాయంత్రం ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. జడ్చర్ల రోడ్డుపై రెడ్డిగూడ కమాన్‌ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న టీఎస్‌ 29 టీ5488 నంబరు గల లారీ ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో అక్కడికక్కడే 12 మంది మృతి చెందారు. డ్రైవర్‌ సక్రుతో కలిపి ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరు హైదరాబాద్‌ తరలిస్తుండగా మృతి చెందారు. గాయపడిన ఆటో డ్రైవరు సక్రు, జంగమ్మ, దేవి, ఇందిరమ్మ, చెన్నయ్యలను మహబూబ్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఇద్దరు పురుషులు, 11 మంది మహిళలు. లారీ డ్రైవరు పి.కిష్టయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారీ డ్రైవర్ మద్యం తాగి ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

లారీ ఢీకొన్న వేగానికి ఆటో తుక్కుతుక్కయింది. ఆటోలోని వారు ఒక్క ఉదుటన ఎగిరి చెల్లాచెదురుగా పడ్డారు. ఆ కారణంగానే ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. చాంది కాలు తెగిపడింది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే 108 అంబులెన్స్‌ రాకపోవడం మృతుల సంఖ్య పెరగడానికి మరో కారణంగా స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరగగానే కొత్తపల్లి గ్రామానికి చెందిన పలువురు ప్రమాద స్థలానికి చేరుకుని 108కు సమాచారం అందించారు. అయితే, గంట వరకు అంబులెన్స్‌ అక్కడకు చేరుకోలేదని వారు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య పెరిగిందన్నారు. ''ప్రమాద స్థలంలో ఏడుగురు మృతి చెందారు. ఐదుగురు కొనఊపిరితో ఉన్నారు. వెంటనే అంబులెన్స్‌ వచ్చి ఉంటే మరికొందరి ప్రాణాలు నిలిచేవి'' అని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

బాధిత కుటుంబాల ఆందోళన

బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాలంటూ గ్రామస్థులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఈక్రమంలో రాత్రి 9 గంటలకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వచ్చి బాధిత కుటుంబాలతో మాట్లాడారు. రైతు బీమా పరిహారం అందిస్తామని, రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేయడంతోపాటు బాధిత కుటుంబాల్లోని పిల్లలను గురుకుల విద్యాలయాల్లో చేర్పిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.



Tags:    

Similar News