వైసీపీ అధినేత వైయస్ జగన్ ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర సాగిస్తున్నారు. నిన్న కురుపాం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అయన ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై పోరాటం చేస్తానంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు చేసిన అవినీతి బయటపడకుండా కాపాడుకునేందుకే సీబీఐ ప్రవేశాన్ని రద్దు చేస్తూ జీవో తెచ్చారని ఆరోపించారు. చంద్రబాబుపై విచారణ చేయమని హైకోర్టు ఆర్డర్ ఇస్తే.. ఏపీకి హైకోర్టు కూడా అవసరం లేదని జీవో ఇచ్చినా ఇచ్చేస్తారని ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయంలోనే కురుపాం అభివృద్ధి చెందింది. వైయస్ సీఎం అయ్యాక తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులు పరుగులు పెట్టించారు. ఆయన హయంలోనే 90 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన 10 శాతం పనులను పూర్తిచేయకుండా చంద్రబాబు సర్కార్ ఆలస్యం చేస్తుందని ఆయన విమర్శించారు. కాగా కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి, పరీక్షిత్ రాజ్ లకు నా మనసులో ఎప్పటికి స్థానం ఉంటుందని జగన్ అన్నారు.