పశ్చిమ జిల్లాలో గొంతెండుతున్న గ్రామాలు... హెచ్‌ఎంటీవీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్
బిందెడు తాగునీటి కోసం ఆ గ్రామాల ప్రజలు పడే అవస్థలు వర్ణనాతీతం.. జీవనాధారమైన నీళ్ల కోసం వారిది నిత్యం జీవన సమరమే.. ప్రాణాలకు తెగించి మరీ గొంతు తడుపుకోవాల్సిన దుస్థితి.. నీటికోసం ఏకంగా జిల్లా సరిహద్దులు దాటిమరీ మంచినీటి కోసం పోరాటం చేయాల్సివస్తోంది వారికి.. ఏరుదాటితేనే గుక్కెడు నీరు.. మరి ఆ ఏరు పొంగితే.. నాటు పడవలు తిరగబడితే.. నీటి కోసం వెళ్లిన వారి బతుకులు ఏటి పాలవ్వాల్సిందే.. గుక్కెడు నీటికోసం గొంతెండుతున్న గ్రామాలపై HMTV ఎక్స్ క్లూజివ్ స్టోరీ. ఓ వైపు ప్రమాదకరంగా ప్రవహించే ఉప్పుటేరు.. మరోవైపు గొంతెండుతున్న గ్రామాలు.. గొంతు తడవాలంటే ఏటిలో నావపై మృత్యువుతో పోరాటం చేయాల్సిందే..పశ్చిమగోదావర ిజిల్లా దుంపగడప గ్రామానికి రోజూ వందలాది మంది మంచినీటి కోసం ఉప్పుటేరు దాటి ప్రాణాలకు తెగించి వస్తుంటారు. అదీ రోజుకు ఓ గంట సేపు మాత్రమే మంచినీటి కుళాయిలు వదులుతారు. అలా నీరు వదిలినప్పుడల్లా ఉప్పటేరు అవతల ఉన్న గ్రామాల వారిని ఒడ్డునుండి పిలవడం.. ఆ గంట సేపూ అందిన నీటినే అతి కష్టంమీద వందలాది కుటుంబాలు సరిపెట్టుకోవడం.. ఇదీ పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దున ఉన్న గ్రామాల జంగంపాడు, పల్లెపాలెం, కొట్టాడ, తాడినాడ గ్రామాల దుస్థితి.. ఇదేదో ఇప్పటి సమస్య కాదు. పాతికేళ్లుగా ఇదే తీరు. కృష్ణాజిల్లా కైకలూరు మండలం పరిధిలోని ఈ గ్రామప్రజల కష్టాలు అక్కడి నాయకులను కదిలించడం లేదు. ఈ గ్రామాలకు కనీసం మంచినీటి సదుపాయం లేదంటే నాయకుల పనితీరు ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ గ్రామాల్లోని వేలాది మంది నిత్యం త్రాగునీటి కోసం కృష్ణాజిల్లా సరిహద్దులు దాటి పశ్చిమగోదావరి జిల్లాకు రావాల్సిందే. మంచినీటి కోసం నాటుపడవల్లో ఉప్పుటేరు దాటి ఆకివీడు మండలం దుంపగడప గ్రామానికి బిందెలతో ఇలా జీవన్మరణ పోరాటం చేయాల్సిందే. దుంపగడప గ్రామాన్ని ఆనుకుని నిత్యం ఉధృతంగా ప్రవహించే ఉప్పుటేరు దాటితే తప్ప బిందెడు నీళ్లు దొరకవని ఈ గ్రామాల్లోని మహిళలు నిత్యం నాటుపడవలపై ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తుంటారు..పడవ తిరగబడితే వీరి బ్రతుకులు ఉప్పుటేరులో సమాధి కావాల్సిందే. ఇలా జంగంపాడు, పల్లెపాలెం, కొట్టాడ, తాడినాడ గ్రామాలేకాదు..ఉప్పుటేరును ఆనుకుని ఉన్న అనేక గ్రామాలది ఇదే దుస్థితి. గుక్కెడు నీరు ఇవ్వండి మహాప్రభో అంటూ ఎంత మంది నేతలను వేడుకున్నా ఫలితం లేదు. వేసవి కాలమే కాదు.. వర్షాకాలంలోనూ వీరికీ నీటి కష్టాలు తప్పవు.. ఏరుదాటే అవకాశం లేకపోతే ఇంటి శ్లాబ్‌పై నిలిచిన నీటినే వాడుకోక తప్పదు. వాడుకునే నీరు పూర్తిగా కలుషితమైపోయింది. గ్రామంలో ఉన్న ఒకటి, అరా బావుల్లోని నీరు కాలుష్యంతో పచ్చగా మారింది. మరో దారిలేక అదే నీటిని ఉపయోగిస్తున్నారు. ఏరు దాటే సాహసం చేయలేని వారు మినరల్ వాటర్ క్యాన్ కొనాల్సి వస్తోంది.. రోజు కూలీపై ఆధారపడ్డ వీరు మినరల్ వాటర్ కొనుక్కోలేక ఇలా ఉప్పుటేరు దాటి బిందెలతో తాగునీరు తెచ్చుకుంటున్నారు. గతంలో గోదావరి నీటిని కోటిన్నర వ్యయంతో పశ్చిమగోదావరిజిల్లా నందమిల్లిపాడు నుండి పెంచికల్లుమర్రు rws స్కీమ్ ద్వారా పైపు లైను కొట్టాడ గ్రామం వరకూ వేసారు. అక్కడితో పైపులైన్ ఆగిపోవడం.. ఆ వేసిన పైపులైన్ నుండి ఐదేళ్లుగా గోదావరి నీరు రాకపోవడంతో పైపు లైను ఉన్నా నీరు దొరకని దీనావస్థలో ఉన్నాయి ఈ గ్రామాలు.. జంగంపాడు గ్రామం నుండి పెంచికల్లుమర్రు వరకూ రెండు కిలోమీటర్ల లోపు ఉన్న దూరంలో పైపులైన్ వేస్తే కొంతలో కొంత నీటికష్టాలు తీరే అవకాశం ఉంది..కానీ ఆ దిశగా పాలకులు దృష్టిసారించడంలేదు..జంగంపాడు గ్రామస్దులంతా స్వచ్చందంగా నాలుగు ఎకరాల్లో చెరువు తవ్వకున్నారు. పెంచికల్లుమర్రు నుండి ఈ చెరువు వద్దకు పైపులైన్ వేస్తే తమ గ్రామాలకు నీటి కష్టాలు తీరుతాయని తాము ఓట్లేసి గెలిపించిన బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరరావును అనేక సార్లు వేడుకున్నారు. కానీ నేటికీ ఫలితం లేదు.. ప్రాణాలకు తెగించి ఉఫ్పుటేరులో ప్రయాణం చేస్తుండగా అనేకసార్లు నాటుపడవలు తిరగబడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎన్ని ప్రమాదాలు జరిగినా వీరికి ఏరు దాటితే తప్ప గుక్కడు నీరు దొరకదు... ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని తెలిసినా రోజూ ఈ సాహసోపేత ప్రయాణం తప్పడంలేదు..