ఒక సినిమాకు ముందు నుంచి పాజిటివ్ బజ్ ఉండి.. రిలీజ్ తర్వాత కూడా పాజిటివ్ టాక్ వచ్చి.. దానికి పోటీగా వచ్చిన సినిమాలకు పూర్తి నెగెటివ్ టాక్ వస్తే.. అంతకంటే కావాల్సిందేముంది..? వసూళ్లు అంచనాల్ని మించిపోతాయి. ‘తొలి ప్రేమ’ విషయంలో అదే జరుగుతోంది. ఈ చిత్రానికి వరుణ్ తేజ్ కెరీర్లోనే అత్యధికంగా తొలి రోజు రూ.5 కోట్లకు పైగా షేర్ రావడం విశేషం. అమెరికాలో అయితే ఈ సినిమా అదరగొట్టేస్తోంది. ఈ సినిమా రిలీజైంది శనివారమే అయినా.. రెండు రోజుల ముందే.. అంటే గురువారమే ప్రిమియర్లు వేసేశారు. రిలీజ్ కొంచెం పెద్ద స్థాయిలోనే చేయడం. ప్రిమియర్లకు పాజిటివ్ టాక్ రావడంతో మంచి వసూళ్లు వచ్చాయి.
శనివారానికే ‘తొలి ప్రేమ’ హాఫ్ మిలియన్ మార్కును దాటేయడం విశేషం. గురువారం ప్రిమియర్లతో 1.52 లక్షల డాలర్లు వసూలు చేసిన ఈ చిత్రం.. శుక్రవారం 1.4 లక్షల డాలర్లు రాబట్టింది. శనివారం ఏకంగా 2.1 లక్షల డాలర్లు వసూలయ్యాయి. మొత్తంగా అప్పుడే హాఫ్ మిలియన్ మార్కును దాటేసిందీ సినిమా. ఆదివారం లక్షన్నర డాలర్లకు అటు ఇటుగా వసూళ్లు రావచ్చని అంచనా. ఇది యుఎస్ తెలుగు ప్రేక్షకలు అభిరుచికి క్లాస్ లవ్ స్టోరీ కావడంతో వీకెండ్ తర్వాత కూడా వసూళ్లు నిలకడగానే ఉండే అవకాశముంది. ఫుల్ రన్లో ఈ చిత్రం మిలియన్ మార్కును దాటడం లాంఛనమే కావచ్చు. ఇక ఓవరాల్‌గా ఈ చిత్రం రూ.25-30 కోట్ల మధ్య షేర్ రాబట్టగలదని అంచనా వేస్తున్నారు.