శపథం వీడి తిరుమల శ్రీవారి సేవలో చినజీయర్ స్వామి

Update: 2017-12-13 09:54 GMT

ఎట్టకేలకు టీటీడీపై త్రిదండి చినజీయర్ స్వామి అలకవీడారు. శ్రీవారి గరుడ సేవలో చినజీయర్ స్వామి పాల్గొన్నారు. స్వామివారి సాత్తుమొర కార్యక్రమంలో పాల్గొని దర్శించుకోనున్నారు. ఓ మండపం కూల్చివేతపై టీటీడీపై కారాలు మిరియాలు నూరి తిరుమలేశుని దర్శించుకోనని శపథం పట్టిన చినజీయర్ స్వామి దాదాపు పదిహేనేళ్ల తర్వాత వెనక్కు తగ్గడం చర్చనీయాంశంగా మారింది. అయితే చినజీయర్ స్వామి వెనక్కు తగ్గడం వెనుక ఉన్న ఆ బలమైన కారణమేంటి? 

2003లో వెయ్యికాళ్ల మండపం కూల్చి వేత సమయంలో చినజీయర్ స్వామి పెద్ద ఎత్తున టీటీడీకి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. ఆలయ అర్చకులు, అధికారులపైన తీవ్రమైన విమర్శలు చేశారు. తిరుమలలో చేస్తున్న 110 తప్పులు అంటూ ఓ లిస్టునే చదివి వినిపించారాయన. వెయ్యి కాళ్ల మండపం నిర్మించకపోతే స్వామివారిని దర్శించుకోనంటూ శపథం చేసిన చినజీయర్ గతంలో పలుమార్లు తిరుమలకు వచ్చినా శ్రీవారిని దర్శించుకోలేదు. దాదాపు 15 ఏళ్లపాటు అలకబూనిన చినజీయర్ స్వామి ఒక్క సారిగా ఎందుకు వెనక్కి తగ్గారు? దీని వెనక కారణాలేంటో ఓ సారి చూడండి.

తిరుమల దేశంలోనే 108 దివ్య వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ప్రముఖమైనది. ఇక్కడ వెలిసిన వెంకన్న స్వామి సాక్షాత్తు వైకుంఠం నుంచి తిరుమల వచ్చారని భక్తుల నమ్మకం. ఇక ప్రాచీన కాలంలో తిరుమల ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రంగా నిలిచింది. తిరుమలను వైష్ణవ క్షేత్రంగా తయారు చేయడంతోపాటు శ్రీవారి ఆలయంలో పూజావిధానాలు, ఉత్సవాలు చేయాల్సిన పద్ధతులను నిర్దేశించింది రామానుజాచార్యులు. 

శైవం, వైష్ణవం తీవ్రంగా ఘర్షిస్తున్న సమయంలో తిరుమల శ్రీనివాసుడు సాక్షాత్తు నారాయణుడి రూపమని ఆయనలో శంఖుచక్రాలు ఉన్నట్టు నిరూపించి తిరుమలని వైష్ణవ క్షేత్రంగా నిలిపినవారిలో రామానుజాచార్యులు ప్రముఖులు. విశిష్టాద్వైతాన్ని ప్రవచించిన రామానుజులు జీయంగార్ల వ్యవస్థను ఏర్పరిచారు. నాడు రామానుజాచార్యులు తన శిష్యుడు అనంతాచార్యులకి తన పంచలోహ ప్రతిమను ఇచ్చారు. ఈ ప్రతిమను అనంతాచార్యులు పూజించుకునేవారు. 

స్వయంగా రామానుజాచార్యులచే ఇవ్వబడిన ఆయన పంచలోహ విగ్రహాన్ని శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ప్రాకారంలోనే ప్రతిష్టించారు. ఇప్పటికీ కూడా శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల సన్నిధిలో ఈ విగ్రహం ఉంటుంది. జీయంగార్లకి రామానుజాచార్యుల విగ్రహం అత్యంత ప్రధానం. తిరుమల వచ్చిన విశిష్టాద్వైత సిద్ధాంతవాదులు.. తిరుమల శ్రీవారికి ఎంత ప్రాముఖ్యతనిస్తారో రామానుజుల విగ్రహానికి అంతే ప్రాధాన్యతనిస్తారు. 

రామానుజులు పుట్టి 1000 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆయన వెయ్యవ జన్మదినం నుంచి ఏడాది పాటు దేశవ్యాప్తంగా సహస్రాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇటు టీటీడీతో పాటు జీయంగార్లు తమిళనాడులోని వైష్ణవులు రామానుజాచార్యుల సహస్ర జయంత్యుత్సవాలు నిర్వహించుకుంటున్నారు. రామానుజుని సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా త్రిదండి చినజీయర్ స్వామి హైదరాబాద్ సమీపంలో భారీ రామానుజాచార్యుల విగ్రహం ప్రతిష్టించనున్నారు. 

గత ఏడాదిగా ఉత్సవాలు జరుగుతున్న నేపద్యంలో  దేశంలోని రామానుజులను అనుసరించే వారంతా తిరుమలలో ఉన్న రామానుజుని విగ్రహాన్ని దర్శించుకుంటున్నారు. చినజీయర్ స్వామి కూడా తిరుమల ఎప్పుడు వచ్చినా ఆలయంలోని భాష్యకారులకి ప్రత్యేక పూజలు చేసేవారు. అయితే వెయ్యికాళ్ల మండపం కూల్చివేతను నిరసిస్తూ మండపాన్ని పునర్నిర్మించే వరకు తాను స్వామిని దర్శించబోనని ప్రకటించిన చినజీయర్ స్వామి గత పదిహేనేళ్లుగా రామానుజుని దర్శనానికి సైతం దూరమయ్యారు. ఆరేళ్ల క్రితం తిరుమల వచ్చినపుడు చినజీయర్ రామానుజుని తల్చుకున్నారు తప్ప దర్శించలేదు.

రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు ముగుస్తుండగా రామానుజాచార్యులను దర్శించాలనే కాంక్ష చినజీయర్ స్వామిలో బలపడింది. కొంత కాలంగా ఈ విషయంలో దీర్ఘాలోచనలో ఉన్న చినజీయర్ మండపం నిర్మాణం కూడా అటకెక్కడంతో వెనక్కు తగ్గి స్వామి దర్శనంతో పాటు భాష్యకార్ల సన్నిధిలోని రామానుజ స్వామిని దర్శించాలని నిర్ణయించుకున్నారు. శ్రీవారి ఆలయంలో జరిగే సాత్తు మొర కార్యక్రమంలో పాల్గొని పదిహేనేళ్ల వ్యథను పోగొట్టుకున్నారు.

Similar News