Maha Shivratri 2023: మహా శివరాత్రి రోజు ఏమి చేయాలి.. ఏమి చేయకూడదు..!
Maha Shivratri 2023: మహా శివరాత్రి రోజు ఏమి చేయాలి.. ఏమి చేయకూడదు..!
Maha Shivratri 2023: హిందు పండుగలలో అత్యంత ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. ఈరోజు ప్రతి ఒక్కరు ఆ పరమశివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. రేపు అనగా ఫిబ్రవరి 18 శనివారం రోజున మహా శివరాత్రి అవుతుంది. ఈరోజు శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతాయి. శివరాత్రి రోజున జాగారానికి, ఉపవాసానికి విశిష్టమైన స్థానం ఉంది. కొందరు భక్తులు నీరు మాత్రమే తాగి జాగారం చేస్తే మరికొందరు పండ్లు, పాలు, తృణధాన్యాలు తిని ఉపవాసం ఉంటారు. అయితే శివరాత్రి రోజు చాలా నిష్టగా ఉండాలి. కొన్ని పనులు చేయాలి మరికొన్ని పనులు చేయకూడదు. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
శివరాత్రిరోజు సూర్యోదయానికి రెండు గంటల ముందే నిద్రలేవాలి. తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఉపవాసం చేయాలి కాబట్టి ఆరోగ్యం సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. వైద్యుడి సలహా మేరకు ఉపవాసం ఉంటే మంచిది. ఎక్కువసార్లు ఓం నమ:శివాయ అని నామస్మరణ చేయాలి. ఇంట్లో అయినా.., దేవాలయంలో అయినా శివలింగానికి నీరు లేదా పచ్చిపాలతో అభిషేకం చేయాలి. నెయ్యి , పెరుగు, తేనెతో కూడా అభిషేకం చేయొచ్చు. దతుర పువ్వులు, పండ్లు, బిల్వ పత్రాన్ని సమర్పించాలి. అర్ధరాత్రి సమయంలో పరమేశ్వరుడికి పూజలు చేస్తే మంచి జరుగుతుంది.
బియ్యం, గోధుమలు, పప్పు ధాన్యాల ఆహారాలకు దూరంగా ఉండాలి. మాంసం, ఉల్లి, వెల్లుల్లిని తీసుకోవద్దు. పొగాకు, మద్యాన్ని తాగకూడదు. శివలింగానికి కొబ్బరి నీళ్లను సమర్పించకూడదు. పూజకు ఇత్తడి, రాగి, వెండి పాత్రలను ఉపయోగించాలి. స్టీల్ పాత్రలు వద్దు. తులసి ఆకులను దేవదేవుడికి సమర్పించకూడదు. రాత్రి జాగరణను అత్యంత భక్తి శ్రద్దలతో చేస్తే.. శివుడు భక్తులకు ఆనందం, శ్రేయస్సును ప్రసాదిస్తాడని నమ్మకం. మహా శివరాత్రి ఉపవాసం శివ రాత్రి రోజు ఉదయం ప్రారంభమై మరుసటి రోజు ఉదయం ముగుస్తుంది.