Bhavani Deekshalu: నేటి నుంచి భవానీ దీక్షాధారణలు ప్రారంభం..45ఏళ్ల క్రితం ప్రారంభమైన భవానీ దీక్షలు
Bhavani Deekshalu: భక్తులు కోరిన కోరికలు తీర్చే బెజవాడ దుర్గమ్మను మండలపాటు భక్తి శ్రద్ధలతో కొలిచే భవానీ దీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 45 ఏళ్ల క్రితం కొంతమంది భక్తులత ప్రారంభమైన భవానీ దీక్షలను నేడు ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు చేపడుతున్నారు.
బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గాదేవి ఆలయంలో కనకదుర్గమ్మను నియమబద్ధమైన దీక్షా విధానంతో పూజించేందుకు అన్ని వర్గాల ప్రజలు, అన్ని వయస్సుల వారు, ఎలాంటి బేధాలు లేకుండా భక్తితో అమ్మవారిని కొలిచేందుకు అవకాశం కల్పించే భవానీ దీక్షలు ఇంద్రకీలాద్రిపై నేటినుంచి ప్రారంభం అవుతాయి. భక్తులు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, సకల పాపాలు, దోషాల నుంచి విముక్తి కలిగించేందుకు ఈ దీక్షలు చేపడతారు.
1979లో దుర్గగుడి ప్రధానార్చకులు లింగంభొట్ల రామకృష్ణ శర్మ విన్నపంపై కంచికామకోటి పీఠాధిపతుల ఆదేశంతో 1979-80 కార్తీక పౌర్ణమి రోజు రాజకొండ కామేశ్వర శర్మ చేతుల మీదుగా ఈ దీక్షలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి క్రమక్రమంగా దీక్షలు చేపడుతున్నవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం 5 నుంచి 6లక్షల మందికి తక్కువ కాకుండా ఈ దీక్షలు స్వీకరిస్తున్నారు. దీక్షలు స్వీకరించే వారి సంఖ్య ఏ ఏటకాయేడు పెరుగుతూ వస్తోంది.
ప్రతిఏటా కార్తీక మాసంలో మొదలయ్యే భవానీ దీక్షలు నవంబర్ 11 నుంచి ప్రారంభం కానున్నాయి. 40రోజుల పాటు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ దీక్షలు చేపడుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు భవానీ దీక్షలు ధరిస్తుంటారు. ఏటా లక్షలాది మంది భవానీ దీక్షదారులు ఇంద్రకీలాద్రికి తరలివస్తుంటారు.
2007 వరకు దసరా ఉత్సవాలతోపాటు భవానీ దీక్షల కార్యక్రమాన్ని నిర్వహించేవారు. దసరా ఉత్సవాల చివరి రోజుల్లో దీక్షల విరమణ చేసేవారు. భవానీ దీక్ష దారులను దర్శనాలకు అనుమతించే క్రమంలో జరిగిన తొక్కిసలాటలో పెద్దెత్తున ప్రాణనష్టం జరగడంతో దసరా ఉత్సవాలతో సంబంధం లేకుండా భవనా దీక్షలను చేపడుతున్నారు. ఈ ఏడాది నేటి నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ ఈవో కేఎస్ రామరావు తెలిపారు.నేడు ఉదయం 11గంటలకు మండల దీక్ష స్వీకరణ ప్రారంభిస్తారని తెలిపారు. 15వ తేదీ వరకు దీక్షల స్వీకరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.