వినాయకుడి పటంలేని ఇల్లుగానీ ... ఆయన ఆలయంలేని ఊరుగానీ ... ఆయన అనుగ్రహం లేని విజయమూ కనిపించదు. ఎవరు ఎలాంటి కార్యాన్ని తలపెడుతున్నా ముందుగా చెప్పుకునేది ఆయనకే. తొలి ఆశీస్సులను ఆయన దగ్గరే పొందుతారు ... తొలి ఆహ్వానాన్ని ఆయనకే అందజేస్తారు ... తొలి ఆతిథ్యం ఆయనకే ఇస్తారు. అలా వినాయకుడు ఇలవేల్పుగా ... ఇష్టదైవంగా పూజలను అందుకుంటున్నాడు.
తాను స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రల్లోనే కాదు, ఇతర దైవ క్షేత్రాల్లో కూడా ఆయన తనదైన ప్రత్యేక స్థానంలో కొలువై కనిపిస్తుంటాడు. ఇక వివిధ రూపాల్లో దర్శనమిచ్చే దైవాల్లో వినాయకుడే ముందువరుసలో కనిపిస్తుంటాడు. అలాంటి వినాయకుడు భారతదేశంలోనే కాకుండా, వివిధ దేశాల్లో సైతం పూజలు అందుకుంటూ ఉండటం విశేషం.
అయితే ఆగస్ట్ 25న వినాయక చవితి పర్వదినం సందర్భంగా గణపతి పూజను ఎలా చేయాలి. చవితి రోజు ఎన్నిగంటలనుంచి ఎన్నిగంటల లోపు పూజ చేయాలి. నిమజ్జనం ఎన్నిరోజులకు చేయాలి అనే పూజా విధానం గురించి పండితులు వివరించారు.
వాటిలో ఈ ఏడాది చతుర్థి తిథి ఆగస్టు 24, 2017 (గురువారం) రాత్రి 8.27 నుంచి ఆగస్టు 25, 2017 (శుక్రవారం) రాత్రి 08.31కి ముగుస్తుంది. గణేశ పూజ శుక్రవారం మధ్యాహ్నం 11:06 నుంచి 1:39గంటల్లోపు పూర్తి చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని చెబుతున్నారు. అంతేకాదు వినాయక చవితినుంచి నిమజ్జనం వరకు 10రోజుల పండుగ కాబట్టి ఆగస్టు 25న నుంచి సెప్టెంబర్ ఐదో తేదీన గణేశ నిమజ్జనానికి ముహూర్తం ఖరారు చేశారు.
విఘ్నేశ్వరుని పూజ ఎలా చేయాలి?
ప్రాతఃకాలంలోనే స్నానమాచరించి. తోరణాలతో ఇంటిని అలంకరించాలి. అనంతరం ఇంటి దేవుడి గుడిలో ఉన్న పీఠపై తెల్లని వస్త్రాన్ని పరిచి దానిపై బియ్యం వేసి విఘ్నేస్వరుణ్ని ప్రతిష్టించి పూజలు చేయాలి. విఘ్నేస్వరుణ్ని ప్రతిష్టించే ముందే అక్షింతలు పువ్వులు సిద్ధం చేసుకోవాలి.
వినాయకుడికి నైవేద్యం -
మోదకాలు, 21 పత్రాలు, పండ్లతో వినాయకుడికి నైవేద్యం సమర్పించి దీపారాధన చేయాలి. దీపారాధనకు ముందు విఘ్నేశ్వరుని శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళితో స్తుతించడం మరిచిపోకూడదు.