ఆర్బీఐ గవర్నర్‌గా శక్తికాంతదాస్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు.. ఆర్బీఐ చాలా గొప్ప సంస్థ, దీనికి సుదీర్ఘ వారసత్వం ఉంది, ఈ వ్యవస్థ మౌలిక విలువలు, విశ్వసనీయత విశిష్టమైనవని అన్నారు. ఆర్బీఐ సిబ్బంది అత్యంత సమర్థులు. ఆర్బీఐలో పని చేస్తూ, దేశానికి సేవలందించడం ఎవరికైనా సంతోషం, మరీ ముఖ్యంగా తనకు ఈ అవకాశం దక్కినందుకు గొప్పగా భావిస్తున్నానని తెలిపారు. కాగా మొన్నటిదాకా ఈ పదవిలో కొనసాగిన ఉర్జిత్ పటేల్ వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేశారు. అయితే గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వానికి, ఆర్బీఐకి మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే ఉర్జిత్ పటేల్ రాజకీయ ఒత్తిళ్లకు గురై పదవినుంచి తప్పుకున్నారని ఆరోపణలు వచ్చాయి. కానీ ఆ ఆరోపణలను ఉర్జిత్ పటేల్ కొట్టిపారేశారు.