తెలుగు రాష్ట్రాల్లో సంక్రాతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రతీ సంవత్సరంలాగే మకర సంక్రాతి సందర్భంగా శబరిమలలో దర్శనమిచ్చే మకర జ్యోతి కోసం లక్షలాది మంది భక్తలు తరలివచ్చారు. స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణలో మకరజ్యోతి దర్శనమిచ్చింది. ఆదివారం సాయంత్రం 6:45 గంటలకు మకర జ్యోతి మూడుసార్లు భక్తులకు దర్శనమిచ్చింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
మకరజ్యోతి అంటే
మకర సంక్రాంతి రోజు శబరిమలై అయ్యప్ప ఆలయంలో స్వామిని ఆభరణాలతో అలంకరించి, హారతి ఇచ్చే సమయంలోనే, ఆలయానికి ఈశాన్య దిశలో ఉండే పర్వతాలపై మకరజ్యోతి దర్శన మిస్తుంది. స్వామి అయ్యప్పకు దేవతలు, ఋషులు ఇచ్చే హారతియే ఈ మకరజ్యోతి అని భక్తులు భావిస్తారు, విశ్వసిస్తారు. ఈ జ్యోతి దర్శనం ఎన్నోజన్మల పుణ్యఫలంగా భావిస్తారు.