ఉభయ వేదాంత ప్రవీణకవిశాబ్ది కేసరి, మహా మహోపాధ్యాయ డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి(93) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సీతమ్మ(88), నలుగురు కుమార్తెలు శేషమ్మ(70), శ్రీదేవి(63), నీలాదేవి(62), గోదాదేవి(61) ఉన్నారు. 1926 మే 1న ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని మోటూరులో జన్మించిన రఘునాథాచార్యులు, పండితులైన తన తండ్రి తాతాచార్యుల వద్ద సంస్కృత దివ్యప్రబంధ సంప్రదాయక విషయాలు అధ్యయనం చేశారు. వరంగల్‌లో ఉంటూ సత్సంప్రదాయ పరిరక్షణ సభ ఏర్పాటు చేశారు. దాని ద్వారా శ్రీ భాష్య, భగవద్విషయ, గీతాభాష్య విషయాలను ఉపదేశిస్తూ ఎందరినో వేదాంత పండితులుగా తీర్చిదిద్దారు. శ్రీవిష్ణు సహస్రనామస్తోత్రం, శ్రీభాష్యము కఠోపనిషత్, ఈశావ్యాసోపనిషత్ వ్యాఖ్యా నాలు, కురంగీపంచకం తదితర యాభైకి పైగా ఉభయ వేదాంత గ్రంథాలను వారు ప్రచురించారు. కాగా కరీమాబాద్‌లోని ఎస్‌ఆర్‌ఆర్ తోటలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. రఘునాథాచార్య స్వామి అంతిమ యాత్రలో పండితులు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.