ప్రజా సంకల్పయాత్ర మరో మైలురాయిని అందుకుంది. వైసీపీ అధినేత జగన్ చేస్తున్న పాదయాత్ర మంగళవారం 121 వ రోజున 16 వందల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా జగన్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. నమ్మించు వంచించు అనే సూత్రాన్ని పాటిస్తూ చంద్రబాబు జనాలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో మైలురాయిని అధిగమించింది. గుంటూరు జిల్లా పలుదేవర్లపాడులో పాదయాత్ర 16 వందల కిలోమీటర్లకు చేరుకుంది. ఈ సందర్భంగా జగన్ అక్కడ ఓ రావి మొక్కను నాటారు. తర్వాత పార్టీ జెండా ఆవిష్కరించారు.
మంగళవారం 121 వ రోజు పాదయాత్రను సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్.. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు నమ్మించు వంచించు అనే రాజకీయ సూత్రాన్ని చక్కగా అమలు చేస్తున్నారని ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తుంటే బాబుకు వణుకుపుడుతుందని అన్నారు.
గతేడాది నవంబర్ 6 న ఇడుపులపాయలో మొదలైన ప్రజాసంకల్పయాత్ర 180 రోజుల పాటు 3 వేల కిలోమీటర్ల మేర సాగనుంది. ఇప్పటి వరకు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను దాటి గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది.