హైదరాబాద్ ముషీరాబాద్‌లో పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పాలిటెక్నిక్ చదువుతున్న సనా తన తల్లిదండ్రుల కళ్ల ముందే భవనంపై నుంచి దూకింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. సన స్వస్థలం పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం రొంపిగుంట గ్రామం. సన ముషీరాబాద్ ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతోంది. సనా ఓ అబ్బాయితో ప్రేమలో ఉన్నట్లు తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకెళ్లడానికి బుధవారం కళాశాల దగ్గరకు వచ్చారు. దీంతో సనా తల్లిదండ్రుల ముందే హాస్టల్ భవనం మూడో అంతస్తు మీద నుంచి కిందకు దూకింది. తీవ్రగాయాలపాలైన ఆమె గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.