భరత్ అనే నేను’తో ఫస్ట్ ఓత్ తో అలరించిన మహేష్ బాబు . శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతః కరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ, పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేశాడు. దీంతో ఆ సినిమా మొత్తం పొలిటికల్ సెటైర్లు ఉంటాయని ఊహించారు. అనుకున్నట్లుగానే ఆ సినిమాలో పొలిటికల్ సెటైర్లు ఉన్నట్లు ఫిల్మింనగర్ వర్గాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
వరస పరాజయాలతో సతమతమైపోతున్న మహేష్ తను నటిస్తోన్న ‘భరత్ అనే నేను’ సినిమాపై ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈసినిమా విజయం బట్టి మహేష్ నటించే తదుపరి సినిమాల మార్కెట్ ఆధారపడి ఉంటుంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొదటిసారిగా ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్న ఈమూవీలో మహేష్ ఒకనాటి సమైఖ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈసినిమాలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉండగా ఈనెల 6వ తారీఖున విడుదల కాబోతున్న ఈమూవీ టీజర్ కు సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు బయటకు వచ్చింది.
ఈమూవీ పై ఆసక్తి మరింత పెంచేలా అదిరిపోయే పొలిటికల్ సెటైర్ డైలాగులు ఉన్న టీజర్ ను కొరటాల శివ డిజైన్ చేసాడట. రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అంటూ మహేష్ ఈ టీజర్ లో సెటైర్ పేలుస్తాడట. ఈ డైలాగ్ అన్ని పార్టీలకు తగులుతుందని టాక్. మరి ఈ కారణంగా సినిమా ఎలాంటి వివాదాల్లో ఇరుక్కుంటుందో చూడాలి!