మహిళలపై దాడులను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు అమలు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా వరుసగా వెలుగుచూస్తున్న ఘటనలు మానవత్వం ఉనికినే ప్రశ్నిస్తున్నాయన్నారు. కథువా ఘటనను నిరసిస్తూ నెక్లెస్ రోడ్ లో ఆయన దీక్ష చేపట్టారు.
జమ్ములోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్య తనను తీవ్రంగా కలచివేసిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా దారుణం జరిగితేనే చలనం వస్తుందన్న ఆయన .. ఢిల్లీలో అత్యాచార ఘటన జరిగిన తర్వాతే నిర్భయ చట్టం వచ్చిందన్నారు. చిన్నారులు, బాలికలను వేధించే వారిని, అత్యాచారానికి ఒడిగట్టే వారిని బహిరంగంగా శిక్షిస్తేనే నేరస్ధుల్లో భయం పుడుతుందన్నారు. సింగపూర్ తరహాలో శిక్షలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పశువులకు కూడా ప్రకృతి నియమం ఉంటుందని మానవ మృగాలకు ఎలాంటి నియమాలు లేకుండా పోయాయని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుత పరిస్దితుల దృష్యా భవిష్యత్ తరాలను కాపాడేందుకు కఠినమైన చట్టాలను అమలు చేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పవన్ కళ్యాణ్ సూచించారు. కథువా ఘటన ఒక ప్రాంతానికి, ఒక కులానికి జరిగినట్టు భావించకుండా దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం స్పందించాలన్నారు. చట్టాలు రూపొందించే వారి చుట్టాలు కాకుండా చూడాలన్నారు.
టాలీవుడ్‌ను కుదిపేస్తున్న శ్రీ రెడ్డి వివాదంపై స్పందించిన పవన్ ..ఈ విషయంలో తాను అన్ని రకాలుగా అండగా నిలుస్తాన్నారు. అన్యాయం జరిగితే కోర్టును ఆశ్రయిస్తే ఎలాంటి అభ్యంతరం లేదంటూనే టీవీ చర్చలకు వెళ‌్లడం సరైంది కాదంటూ సలహా ఇచ్చారు. కఠినమైన చట్టాలు, వేగవంతమైన విచారణ, శిక్ష అమలులో జాప్య నివారణపై మార్పులు రావాల్సిన అవసరముందని పవన్ అభిప్రాయపడ్డాడు. మహిళా సాధికారికతకు తమ పార్టీ పెద్ద పీట వేస్తుందన్న ఆయన అన్యాయం జరిగిన చోట తాము ప్రశ్నిస్తామన్నారు.