పవన్‌ను మరోసారి ట్విట్టిన వర్మ

Update: 2018-05-08 05:57 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, సంచలనాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పవన్ అభిమానులకు, వర్మకు మధ్య ట్విట్టర్ వేదికగా వార్ నడుస్తుంది. ఆన్ లైన్ లో..తన సినిమా టీజర్ ని కావాలనే డిస్ లైక్ చేస్తున్నారని..పవన్ ఫ్యాన్స్ ని టార్గెట్ గా చేసుకుని సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపించాడు వర్మ. మెగా ఫ్యామిలీని విమర్శించనని గతంలో ఒట్టేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ..తాజాగా ఆ ఒట్టు తీసి గట్టు మీద పెట్టాడు. అలా ఒట్టు గట్టు మీద పెట్టాడో లేదో..ఇప్పుడు మళ్లీ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశాడు. కానీ..ఈసారి ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ అభిమానులపై విమర్శలు గుప్పించాడు. రామ్ గోపాల్ వర్మకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు అసలు గొడవెక్కడొచ్చిందంటే..అక్కినేని నాగార్జున హీరోగా వర్మ తెరకెక్కిస్తున్న..ఆఫీసర్ సినిమా టీజర్ రీసెంట్ గా విడుదలైంది. యూట్యూబ్ లో 'ఆఫీసర్' సినిమా టీజర్ కి 11 వేలకు పైగా డిస్ లైక్ లొచ్చాయి. ఈ డిస్ లైక్ లన్నీ పవన్ ఫ్యాన్సే చేశారని వర్మ భావించాడు. దీంతో..పవన్ అభిమానులపై ట్విట్టర్ లో విరుచుకుపడ్డాడు. పవన్ కళ్యాణ్ అభిమానుల్ని రెచ్చగొట్టేలా వర్మ వరుస ట్వీట్లు పెట్టాడు. తాను డైరెక్ట్ చేసిన `ఆఫీస‌ర్‌` సినిమాకు 11 వేల డిస్‌లైక్‌లు మాత్ర‌మే వ‌చ్చాయని..అంటే ప‌వ‌న్ ఫ్యాన్స్ 11 వేల మంది మాత్ర‌మేనా అని చురకంటించాడు. 11 కోట్ల మంది తెలుగు ప్ర‌జ‌ల్లో 11 వేల మంది మాత్ర‌మే పవన్ అభిమానులున్నారంటే..జ‌న‌సేన పార్టీ దీని గురించి సీరియ‌స్‌గా ఆలోచించాలని ట్వీట్ చేశాడు. అక్కడితో ఆగకుండా..జ‌న‌సేన కూడా `ప్ర‌జారాజ్యం`లా ప‌రాజ‌యం పాల‌వ‌్వక త‌ప్ప‌దంటూ ఘాటుగా విమర్శించాడు. మరోవైపు..వర్మ ట్వీట్లకు పవన్ కళ్యాణ్ అభిమానులు ధీటుగానే రిప్లై ఇస్తున్నారు. కనీసం..సినిమా టీజర్ ఓపెన్ చేయకుండానే డిస్ లైక్ చేస్తున్నామని..ట్వీట్లు పెడుతున్నారు. మరికొంత మంది ఫ్యాన్స్..వర్మ కావాలనే తమను రెచ్చగొడుతున్నాడని..సినిమా ప్రమోషన్ కోసం అభిమానుల్ని వాడుకోవడానికి చూస్తున్నాడని కామెంట్లు పెడుతున్నారు. ఛాన్స్ దొరికితే చాలు వర్మ ప్రత్యక్షంగానో..పరోక్షంగానో..మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. ఈసారి డైరెక్ట్ గా కాకుండా..ముందు పవన్ అభిమానుల్ని విమర్శించి..ఆ తర్వాత జనసేన పార్టీపై విమర్శలు గుప్పించాడు. మొత్తానికి మెగా ఫ్యామిలీకి, వర్మకు మధ్య ఉన్న వైరం ఇప్పుడప్పుడే చల్లారేలా లేదు.

Similar News