తెలంగాణలోని వ్యవసాయ భూములకు కొత్త పాస్ పుస్తకాలు రానున్నాయి. మార్చి 11న రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేయనున్నారు. వివాదాలు లేని భూమిని గుర్తించిన రెవెన్యూ శాఖ.. వివాదాస్పద భూములపై ఫోకస్ పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 2.80 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా ఇప్పటికి 1.42 కోట్ల ఎకరాలు భూమికి పట్టాదార్ పాస్ పుస్తకాలను ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. మరోవైపు కోర్టులో ఉన్న భూవివాదాల పరిష్కారానికి సిద్ధమవుతోంది.
మార్చి 11న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఒకే రోజు కొత్త పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీకి తెలంగాణ సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ రికార్డుల ప్రక్షాళన ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 1,12,077 చదరపు కిలోమీటర్లు భూభాగం ఉంది. ఇందులో 2.80 కోట్ల ఎకరాల భూమి వ్యవసాయ యోగ్యమైనది. ఇందులో 1.42 కోట్ల ఎకరాలు వివాదరహితమైనవిగా గుర్తించారు. వీటిని పార్ట్ ఏలో గుర్తించారు. మిగిలిన 17.89 లక్షల ఎకరాల భూములు న్యాయపరమైన వివాదాల్లో నలుగుతున్నాయి. వీటిని పార్ట్ బీలో పరిష్కరించనున్నారు.
పార్ట్ బీ చేపట్టడానికి ప్రభుత్వం కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. అంటే కోర్టు పరిధిలో ఉన్న వాటిని సైతం పరిష్కరించేందుకు త్వరలోనే కేబినెట్ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు. పార్ట్ బీ కోసం స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించనుంది. ఈ ప్రక్రియ ఫిబ్రవరి చివరకల్లా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోంది. అయితే ఇదంత సులుభం కాదని అంటున్నారు. వివాదాస్పద భూముల్లో అధికభాగం భూ మాఫియా చేతుల్లో ఉంది. అందువల్ల రెవెన్యూ సిబ్బందికి రక్షణగా పోలీసుల సేవలు తప్పనిసరి. పార్ట్- బి డ్రైవ్ సమయంలో సిబ్బందికి తగినంత రక్షణ కల్పించాలని అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు పంపనుంది. ఇక ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించి పౌర న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులను కోర్టు బయట పరిష్కారించుకోవాలని ప్రభుత్వం అధికారులకు సూచించనుంది.