టీమిండియా పేసర్ మహ్మద్ షమీ వివాహేతర సంబంధాలను అతని భార్య హాసిన్ జాహన్ బట్టబయలు చేశారు. పలువురి యువతులతో షమీ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, చాటింగ్ స్క్రీన్ షాట్‌లను ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఇవన్నీ షమీ ఫోన్‌లోనే గుర్తించినట్లు హాసిన్ జాహన్ తెలిపారు.
తాజాగా హాసిన్ మీడియాతో మాట్లాడుతూ..‘గత రెండేళ్ల నుంచి షమితో పాటు ఆయన కుటుంబసభ్యులు నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు. అంతేకాదు నన్ను చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే షమికి ఎంతో మంది అమ్మయిలతో సంబంధాలు ఉన్నాయి. ఆ విషయం నాకు తెలియడంతో నన్ను వేధించడం మొదలుపెట్టారు’ అని హసిన్ చెప్పారు. ‘దేశంలో చాలా మంది అమ్మాయిలతో షమికి అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఒక రోజు షమి కారులో మొబైల్ ఫోన్ దొరికింది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అసభ్యకర సందేశాలు కనిపించాయి. అవన్ని చదవడానికి ఒక రాత్రి సరిపోలేదు. చాలా మంది అమ్మాయిల ఫొటోలు కనిపించాయి. పాకిస్థాన్‌కు చెందిన ఓ అమ్మాయితో షమికి పెళ్లి అయ్యింది. దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ అనంతరం షమి ఆ అమ్మాయి కోసం పాకిస్థాన్ కూడా వెళ్లాడు. గతంలో ధర్మశాలలో టీమిండియా మ్యాచ్‌కు నన్ను తీసుకెళ్లమని షమిని కోరాను. అతడు వద్దన్నాడు. అక్కడితో ఊరుకోకుండా అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి మరీ నన్ను తిట్టాడు. టీమిండియా ఎక్కడికి వెళ్లినా కుల్‌దీప్ అనే వ్యక్తి.. షమికి అమ్మాయిలను సప్లై చేస్తాడు. బీసీసీఐకి ఈ విషయం తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు’అని హాసిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘త్వరలో షమితో పాటు ఆయన కుటుంబసభ్యులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటా’ అని ఆమె తెలిపారు. షమి-హాసిన్‌ది ప్రేమ వివాహం. 2014 జూన్ 6న వీరు పెళ్లి చేసుకున్నారు. 2012లో ఓ ఐపీఎల్ మ్యాచ్‌లో షమి తొలిసారి హాసిన్‌ను చూశాడు. అప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప.
ఈ వార్తలపై మహమ్మద్ షమి ట్విటర్ ద్వారా స్పందించాడు. ‘హాయ్. నేను మహమ్మద్ షమిని. నా వ్యక్తిగత జీవితం గురించి ఏవేవో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిల్లో ఏమాత్రం నిజం లేదు. నాపై జరుగుతున్న కుట్ర ఇది. నా క్రికెట్ జీవితాన్ని నాశనం చేసేందుకే ఎవరో ఇదంతా చేస్తున్నారు’ అని షమి పేర్కొన్నాడు.