ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలిపై టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఢిల్లీ కోర్టులో న్యాయపోరాటం ప్రారంభించారు. ఈ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు చెల్లించాల్సిన 150 కోట్ల రూపాయలు చెల్లించలేదని ధోనీ దావా దాఖలు చేశాడు. ధోనీతో పాటు కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్, డుప్లెసిస్ కూడా ఈ సంస్థపై ఢిల్లీ హైకోర్టులో దావా వేశారు. బ్రాండింగ్, మార్కెటింగ్ కార్యకలాపాలకోసం తమకు చెల్లింపులు చేయలేదని వారు దావాలో పేర్కొన్నారు.
బ్రాండింగ్, మార్కెటింగ్ కార్యకాలపాల్లో కోసం అమ్రపాలి గ్రూప్ తమకు ఎలాంటి నగదు చెల్లించలేదని అమ్రపాలి గ్రూప్‌కు క్రికెట్ స్టార్లను మేనేజ్ చేస్తున్న రితి స్పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ పాండే తెలిపారు. ఆ రియల్ ఎస్టేట్ సంస్థ మొత్తం క్రికెటర్లకు రూ.200 కోట్లు బకాయి పడిందని చెప్పారు. ఈ రియల్ ఎస్టేట్ గ్రూప్ హౌజింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడం లేదని ఆ ప్రాజెక్ట్ తరుఫు గృహ వినియోగదారులు పెద్ద ఎత్తున్న సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోయడంతో, 2016 ఏప్రిల్‌లో ఇక ఆ బ్రాండు అంబాసిడర్‌గా ధోని తప్పుకున్న సంగతి తెలిసిందే. కొంతమంది రెసిడెంట్లు తమ ట్వీట్లను ధోని కూడా ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ విషయంపై స్పందించడానికి అమ్రపాలి గ్రూప్ అధికార ప్రతినిధి నిరాకరించారు.