జమ్మూకాశ్మీర్‌లో ఘోరం..గుడిలో బంధించి..నాలుగు రోజుల పాటు నలుగురి పైశాచికం

Update: 2018-04-13 05:08 GMT

మృగాళ్ల పైశాచికత్వానికి మరో లేత కుసుమం రాలిపోయింది. చిరునవ్వులతో కాలం గడపాల్సిన చిన్నారి.. మనిషనే రంగేసుకున్న క్రూరమృగాలకు బలైపోయింది. జమ్మూకాశ్మీర్ లో కథువాలో 8 యేళ్ల చిన్నారిని హింసించి అత్యాచారం చేసి చంపిన ఘటన మానవత్వానికే మాయని మచ్చగా మిగిలిపోయింది. గత జనవరిలో జరిగిన ఈ ఘాతుకంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి.. కాశ్మీర్ నిర్భయగా చరిత్రలో మిగిలిపోయింది. 

బకర్వాల్ ముస్లీంలపై పగబట్టిన స్థానిక రిటైర్ట్ రెవెన్యూ అధికారి సాంజీ రామ్  ఈ దారుణానికి ఒడిగట్టాడు. గోవధ చేశారని డ్రగ్స్ స్మగ్లింగ్  చేస్తున్నారనే కారణాలతో బకర్వాల్ ముస్లీంలపై ప్రతీకారాన్ని పెంచుకున్న సాంజీరామ్ గత జనవరి 10 వ తేదీన ఇంటి దగ్గర గుర్రాలను మేపుతున్న నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి ఓ గుడిలో బంధించాడు. చిన్నారికి మత్తుమందు ఇచ్చి ఆమెపై అత్యాచారం చేయాలని తన మేనల్లుడిని ఉసిగొల్పాడు. నాలుగు రోజుల పాటు సాంజీరామ్ కుమారుడు విశాల్, అతని స్నేహితుడు, మేనల్లుడు, పోలీస్ అధికారి దీపక్  ఖజూరియా నలుగురు కలిసి గుడిలోనే చిన్నారిని తీవ్రంగా హింసిస్తూ అత్యాచారం చేశారు. నాలుగు రోజుల తర్వాత జనవరి 14 న అమ్మాయిని రాడ్‌తో కొట్టి చంపి మృతదేహాన్ని పక్కనే ఉన్న అడవిలో పడేశారు. అంతేకాకుండా ఈ విషయం వెలుగుచూడకుండా ఉండేందుకు.. సాంజీ రామ్‌ పోలీసులకు 3 లక్షలు లంచం ఇచ్చారు. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై జమ్ము కశ్మీరు రగిలిపోతోంది. దీనిపై క్రైం బ్రాంచ్‌ పోలీసులు అభియోగ పత్రం దాఖలు చేశారు. సాంజీ రామ్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. అతని మేనల్లుడు, కొడుకు, మేనల్లుడి స్నేహితుడు, ఓ ఎస్సై, మరో హెడ్‌ కానిస్టేబుల్‌, ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారులను నిందితులుగా చార్జిషీటులో పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ నెల 16 న స్థానిక న్యాయస్థానం ఈ కేసును విచారించనుంది. ఈ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ జమ్ము హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన కాశ్మీర్ సీఎం మహబూబా ముఫ్తీ బాలికలపై అత్యాచారాలకు పాల్పడే దోషులకు ఉరిశిక్ష పడేలా చట్టం తీసుకువస్తామని తెలిపారు. 

మరోవైపు నిందితులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఇద్దరు రాష్ట్ర బీజేపీ మంత్రులు పాల్గొనడం తీవ్ర వివాదాస్పదం అయ్యింది. ఈ ఘటనపై కేంద్రమంత్రి వీకే సింగ్  మాట్లాడుతూ.. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ఇటు ఈ ఘోరంపై యావత్ దేశం దిగ్బ్రాంతికి గురైంది. బాలీవుడ్  నటులు.. తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా.. ప్రశ్నిస్తున్నారు. మనదేశం ఎటు వెళ్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Similar News