భారత క్రికెట్ జట్టు ప్రధాన బౌలర్ జస్ప్రిత్ బూమ్రా ఇంట విషాదం నెలకొంది. బుమ్రా తాతయ్య సంతోక్ సింగ్ బుమ్రా(84) మృతదేహం సబర్మతి నదిలో లభ్యమైంది. ఆయన మృతదేహాన్ని అహ్మదాబాద్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అధికారులు ఆదివారం గుర్తించారు.అదృశ్యమైన మరుసటి రోజే సంతోక్ సింగ్ శవమై కనిపించాడు. జీవితంపై విరక్తి చెందిన ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతోక్ సింగ్ డిసెంబర్ 6న బుమ్రా పుట్టినరోజును పురస్కరించుకుని ఝార్ఖండ్ నుంచి అహ్మదాబాద్‌కి వచ్చారు. కానీ బుమ్రాను కలవడానికి అతని తల్లి దల్జీత్ కౌర్ ఒప్పుకోలేదు. దాంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. డిసెంబర్ 8న సంతోక్.. ఝార్ఖండ్‌లో ఉన్న తన కుమారుడు బల్వీందర్ సింగ్‌కు ఫోన్ చేసి చనిపోయిన తన భార్య వద్దకు వెళుతున్నానని చెప్పినట్లు సమాచారం.
ఒకప్పుడు వ్యాపారవేత్తగా బతికిన సంతోక్.. బుమ్రా తండ్రి చనిపోవడం, వ్యాపారంలో నష్టాలు రావడంతో ఇప్పుడు ఝార్ఖండ్‌లో తన మొదటి కుమారుడు బల్వీందర్ వద్ద ఉంటూ ఆటో నడుపుకొంటూ జీవిస్తున్నారు. బుమ్రాను కలవడానికి ఒప్పుకోకపోవడంతో మనస్తాపానికి గురై నదిలో దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బుమ్రా ప్రస్తుతం ధర్మశాల వేదికగా శ్రీలంకతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఆడుతున్నాడు.