చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుంలో జగన్ ప్రజా సంకల్పయాత్ర కొనసాగుతోంది. చంద్రబాబు పాలన అంతా అవినీతిమయం అని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వస్తే.. ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు జగన్. 53వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం సదుంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ‘మరో ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. నాలుగేళ్ల పాటు పింఛన్లు ఇవ్వకుండా అన్యాయం చేసిన ఈ వ్యక్తికి ఇప్పుడు జ్ఞానోదయం అయింది. పింఛన్లు ఇవ్వడం లేదన్న విషయం ఇప్పుడే తెలిసిందని డ్రామాలు ఆడుతున్నారు. నాలుగేళ్లలో ఏ ఒక్క హామీని అమలు చేయని వ్యక్తి తనకు ఓట్లు వేయకపోతే ప్రజలు సిగ్గుపడాలని చెప్పడం దుర్మార్గం. చిత్తూరు జిల్లాకు చంద్రగ్రహణం పట్టుకుని, అభివృద్ధి ఆగిపోయింది. నాలుగేళ్లలో చంద్రబాబు చేసిందేమీ లేదు. ఏమీ చేయకుండానే నాకు ఓటు వేయకపోతే ప్రజలు సిగ్గుపడాలని చంద్రబాబు అంటున్నారు. ఆయన మాటలు చూస్తే కళ్లు నెత్తికెక్కినట్లున్నాయి. అని అన్నారు.