వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నేడు శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించనుంది. శనివారం రాత్రి జగన్ పాదయాత్ర విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలానికి చేరుకుంది ఉదయం 10 గంటలకు గరుగుబిల్లి మండలంలోని నాగూరుకు... అనంతరం దత్తివలస మీదుగా చిలకాం చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్న భోజన విరామం తర్వాత పాదయాత్ర ప్రారంభించి 3 గంటలకు రావివలసకు చేరుకుంటారు. 3.30గంటలకు జిల్లాలోని వీరఘట్టం మండలం కెల్లకు చేరుకుంటారు. దీంతో శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి జగన్ ప్రజాసంకల్పయాత్ర మొదలుకానుంది. కెల్ల నుంచి నడిమికెల్ల వరకు గంటపాటు పాదయాత్ర కొనసాగించి ఆ తర్వాత రాత్రికి జగన్ అక్కడే బస చెస్తారని.. ఆ పార్టీ ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం ఓ ప్రకటనలో తెలిపారు. ఇదిలావుంటే జిల్లాలో తితలీ తుఫాను బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వైసీపీ అక్కడ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నది కానీ స్వయంగా జగన్ వెళ్లి పరామర్శించలేదు. అయితే నేటినుంచి జగన్ జిల్లాలోకి వస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.