భక్తితో కావచ్చు..బరువు తగ్గేందుకు కావచ్చు..కారణమేదైనా చాలామంది తరచూ ఉపవాసం చేస్తుంటారు. సరైన అవగాహన లేకుండా తరచూ ఉపవాసాలు చేస్తుంటే రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని అంటుంటారు. అయితే హార్వర్డ్ శాస్త్రవేత్తలు మాత్రం తరచూ ఉపవాసం ఉండే వారికి ఆయువు పెరుగుతుందని వెల్లడించారు. తెల్ల రక్త కణాల పనితీరును మెరుగుపరిచే మైటో కాండ్రియా చురుకుగా కదులుతుంది. వీటితో పాటు ఉపవాసం వల్ల శరీరంలో పేర్కొని పోయిన కొవ్వులను మైటోకాండ్రియా కణాలు కరిగించడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆయువు కూడా పెరుగుతుందని స్పష్టం చేశారు.
ఖాళీ కడుపుతో ఉపవాసం ఉండడం వల్ల కలిగే నష్టాలు
అస్సలు ఆహారం తీసుకోకుండా ఖాళీ కడుపుతో ఉండిపోతుంటే బలహీనత, అసిడిటీ, డస్సిపోవటం, తలనొప్పుల వంటి బాధలు చాలా వేధిస్తాయి. కాబట్టి ఉపవాసం అంటే పూర్తిగా ఏమీ తినకుండా ఉండడం కాదని, ఈ సమయంలో కూడా శరీరానికి పోషకాలు అవసరమని గుర్తించాలి. మధుమేహం, అసిడిటీ వంటి సమస్యలున్నవారు, గర్భిణులు, పిల్లలు.. అసలు ఉపవాసం చేయకపోవటం మేలు. మరోవైపు చాలామంది ఉపవాసం ముగిస్తూనే బాగా నూనె, నెయ్యి వేసి వండిన స్వీట్లు, కొవ్వు పదార్ధాల వంటివి దండిగా తింటుంటారు. ఇదీ మంచిది కాదు. దీనివల్ల ఉపవాస ఫలమూ ఉండదు. కాబట్టి ఉపవాస సమయంలో- మన శరీరానికి అవసరమైన పోషకాహారం, మితంగా తీసుకోవటం మంచిది. ఇలా చేస్తే ఉపవాసం తర్వాత శరీరం మరింత ఉత్తేజంగా, తేలికగా, ఉల్లాసంగా అనిపిస్తుంది.
ఉపవాసం ఉన్నవారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి
ఉపవాస సమయంలో- పండ్లు, కూరగాయ ముక్కల వంటివి ఎక్కువగా తీసుకోవటం మంచిది. పండ్లు దండిగా తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది, శక్తికీ కొదవుండదు. అలాగే పాలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. పాలు, క్యారెట్ల వంటివాటితో చేసిన పదార్ధాలు తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి, మాంసకృత్తులు, క్యాల్షియం వంటివన్నీ లభిస్తాయి. ఉపవాస సమయంలో- మజ్జిగ, పండ్ల రసం, నిమ్మనీరు, కూరగాయ సూపుల వంటి ద్రవాహారం తరచుగా తీసుకోవాలి. ఇలా చేస్తే అసిడిటీ బాధ కూడా ఉండదు. ఉపవాసం ముగిసిన తర్వాత కూడా కొవ్వు పదార్ధాలు కాకుండా..మెంతికూర కలిపి చేసిన మేథీ చపాతీ సగ్గుబియ్యం, కూరముక్కల వంటివి కలిపిన ఖిచిడీ,పాలు, పెసరపప్పు వంటి వాటితో చేసిన పాయసం వంటివి తీసుకోవటం ఉత్తమం.