ఇండోనేషియాను మరోసారి సునామీ అతలాకుతలం చేసింది. జావా, సుమత్రా దీవుల్లో రాకాసి అలలు ఎగిసిపడి 222 మందిని పొట్టనబెట్టుకోగా, వందలాది మంది గల్లంతయ్యారు. సముద్రంలో సంభవించిన భూకంపం ధాటికి తీర ప్రాంతాల్లోని వందలాది ఇల్లు కుప్పకూలాయి. ఇప్పటి వరకు 584 మంది క్షతగాత్రులను గుర్తించినట్లు ఇండోనేషియా విపత్తు నిర్వహణ విభాగం ప్రకటించింది. తరుచూ భూకంపాలు చోటుచేసుకునే ఇండోనేషియాలో తాజాగా సముద్రంలో అగ్ని పర్వతం విస్ఫోటనం చెంది సునామీ సంభవించింది. రాకాసి అలలు ఎగిసిపడి తీర ప్రాంతంపై పంజా విసిరాయి. సముద్రాన్ని అల్లకల్లోకంగా మార్చి తీరప్రాంతాలను ముంచెత్తింది. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అనేక భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చాలా మంది ప్రజలు శిథిలాల్లో చిక్కుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించి వెలికితీసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సహాయం కోసం ఆర్థిస్తున్న వారిని ఆదుకునేందుకు నీరు, ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు.
దక్షిణ సుమత్రా, పశ్చిమ జావాలోని బీచ్‌ల్లో నిన్న రాత్రి అకస్మాత్తుగా సునామీ సంభవించడంతో ప్రజలంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఉవ్వెత్తున ఎగసిపడ్డ అలల ధాటికి తీర ప్రాంతంలోని భవనాలన్నీ దెబ్బతిన్నాయి. అయితే సునామీ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికలు చేసే అవకాశం లేకపోవడంతో.. ప్రాణ, ఆస్తినష్టం భారీగా జరిగినట్లు అధికారులు వెల్లడించారు. కొన్నిచోట్ల భారీ వృక్షాలు కూడా నేలకూలాయి. వీకెండ్ కావడంతో ఎక్కువగా మంది బీచ్‌లకు చేరుకున్నారు. అయితే ఎక్కువమంది ఉండే బీచ్‌ను రాకాసి అల తాకడంతో విధ్వంసం జరిగింది. భారీగా నీటి అలలు జనాలు, భవనాలను ముంచెత్తాయి.
తాంజుంగ్ లెసుంగ్ బీచ్, లెసుంగ్ బీచ్, తెలుక్ లడ, పనింబాగ్, కరిటా బీచ్‌లోని రెసిడెన్షియల్, టూరిస్టు ప్రాంతాలు సహా కోస్తా ప్రాంతాలు, పండేగ్లాంగ్ జిల్లాలపై తీవ్ర సునామీ ప్రభావం పడింది. 60 రెస్టారెంట్లు, తొమ్మిది హోటళ్లు, 350 పడవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అలల దాటికి సముద్రంలో గల్లంతయిన వారి కోసం సహాయక చర్యులు చేపడుతున్నారు. సునామీ దాటికి గురైన ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. క్రాకటోవ్ అనే అగ్ని పర్వతం పేలడం వల్లే సునామీ వచ్చి ఉంటుందని ఇండోనేషియా అధికారులు వెల్లడించారు. పర్వతం నుంచి కొండచరియలు విరిగి సముద్రంలో పడటంతో సునామీ వచ్చినట్లు ప్రాథమికంగా చెబుతున్నారు. అయితే కచ్చితమైన కారణాలను కనుగొనేందుకు ఇండోనేషియా భూగోళ పరిశోధన విభాగం ముమ్మర ప్రయత్నం చేస్తోంది.