ఇండోనేషియాలో సునామీ విధ్వంసం సృష్టించింది. మృతుల సంఖ్య 168 కి చేరింది. సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. 600 మందికి పైగా గాయపడ్డారని స్పష్టం చేసింది. మృతుల్లో ఎక్కువగా విదేశీ పర్యాటకులే ఉన్నారని స్పష్టం చేసింది. దాదాపు 20 మంది గల్లంతైనట్లు చెబుతున్నారు. ఆచూకీ కోసం సహాయక బృందాలను గాలిస్తున్నాయని వివరించింది. దక్షిణ సుమత్రా, పశ్చిమ జావాలోని బీచ్‌ల్లో నిన్న రాత్రి అకస్మాత్తుగా సునామీ సంభవించడంతో ప్రజలంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఉవ్వెత్తున ఎగసిపడ్డ అలల ధాటికి తీర ప్రాంతంలోని భవనాలన్నీ దెబ్బతిన్నాయి.
అయితే సునామీ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికలు చేసే అవకాశం లేకపోవడంతో ప్రాణ, ఆస్తినష్టం భారీగా జరిగినట్లు అధికారులు వెల్లడించారు. కొన్నిచోట్ల భారీ వృక్షాలు కూడా నేలకూలాయి. వీకెండ్ కావడంతో ఎక్కువగా మంది బీచ్‌లకు చేరుకున్నారు. అయితే ఎక్కువమంది ఉండే బీచ్‌ను రాకాసి అల తాకడంతో విధ్వంసం జరిగింది. భారీగా నీటి అలలు జనాలు, భవనాలను ముంచెత్తాయి. క్రాకటోవ్ అనే అగ్ని పర్వతం పేలడం వల్లే సునామీ వచ్చి ఉంటుందని అక్కడి అధికారులు వెల్లడించారు. పర్వతం నుంచి కొండచరియలు విరిగి సముద్రంలో పడటంతో సునామీ వచ్చినట్లు ప్రాథమికంగా చెబుతున్నారు. అయితే కచ్చితమైన కారణాలను కనుగొనేందుకు ఇండోనేషియా భూగోళ పరిశోధన విభాగం ముమ్మర ప్రయత్నం చేస్తోంది.