ముక్కోణపు టీ20 సిరీస్ నాలుగో మ్యాచ్‌లో శ్రీలంకపై టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని భారత్ జట్టు మరో తొమ్మిది బంతులు ఉండగానే ఛేదించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లంక జట్టు ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. ఉనాద్కత్ వేసిన తొలి ఓవర్‌లోనే 15 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత ఓవర్‌లో వాషింగ్టన్ సుందర్ తొమ్మిది పరుగులే ఇచ్చాడు. మూడో ఓవర్‌లో శార్దూల్ ఠాకూర్ గుణతిలకను ఔట్ చేశాడు. కాసేపటికే కుశాల్ పెరీరాను సుందర్ పెవిలియన్‌కి పంపాడు. మూడో వికెట్‌కు కుశాల్ మెండిస్‌తో కలిసి 62 పరుగులు చేసిన ఉపుల్ తరంగ వెనుదిరిగాడు. థిసారా పెరీరా, జీవన్ మెండిస్, కుశాల్ మెండిస్ వెంటవెంటనే ఔటవడంతో శ్రీలంక జోరు తగ్గింది. శనక ఫర్వాలేదనిపించడంతో లంక 9 వికెట్లకు 152 పరుగులు చేసింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు, వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీశారు. భారత్ బ్యాటింగ్‌లో మనీష్ పాండే 42, దినేశ్ కార్తీక్ 39 పరుగులతో రాణించారు.