టీమిండియా మరో కీలక వన్డే సమరానికి విశాఖ వేదికగా తెలుగు గడ్డపై రంగం సిద్ధమయ్యింది. సూపర్ సండే డే-నైట్ ఫైట్ గా జరిగే ఈ పోటీలో ఇటు ఆతిథ్య టీమిండియా అటు శ్రీలంక విజయమే లక్ష్యంగా పోటీకి దిగుతున్నాయి. సిరీస్ విజేతను నిర్ణయించే ఈ పోటీ రేపు మధ్యాహ్నం 1-30 గంటలకు ప్రారంభమవుతుంది.
భారత్ వేదికగా 2017 క్రికెట్ సీజన్లో చిట్టచివరి వన్డే సమరానికి స్టీల్ సిటీ విశాఖలోని ACA- VDCA స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది. శ్రీలంకతో సూపర్ సండే ఫైట్ గా జరిగే ఈ పోటీలో నెగ్గిన జట్టుకే సిరీస్ విజేతగా నిలిచే అవకాశం ఉండడంతో రెండుజట్లూ విజయమే లక్ష్యంగా పోటీకి దిగుతున్నాయి. విశాఖ ఏసీఏ స్టేడియం ఆతిథ్యంలో 7వ సారి జరుగుతున్న ఈ వన్డే మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. 30వేల సీటింగ్ కెపాసిటీతో నిర్మించిన ఈ స్టేడియం కిటకిటలాడటం ఖాయమైపోయింది.
అంతేకాదు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అమ్మమ్మగారి ఊరు సైతం విశాఖ కావడంతో స్టీల్ సిటీ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎక్కడలేని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. రెండుజట్లు మ్యాచ్ కు రెండురోజుల ముందే ఇక్కడకు చేరుకొని నెట్ ప్రాక్టీస్ లో చురుగ్గా పాల్గొనడంతో ప్రస్తుతం విశాఖ నగరమంతా క్రికెట్ ఫీవర్ తో ఊగిపోతోంది.
విశాఖ స్టేడియం పిచ్ ను బ్యాటింగ్ కు అనువుగా తయారు చేయటంతో అభిమానులకు పసందైన పరుగుల విందేనని మరో భారీస్కోరింగ్ మ్యాచ్ ఖాయమని నిర్వాహక సంఘం చెబుతోంది. ఆతిథ్య టీమిండియా మాత్రం రెండోవన్డేలో పాల్గొన్న జట్టునే ఆఖరి వన్డేలో సైతం కొనసాగించే అవకాశాలున్నాయి. మరోవైపు శ్రీలంక తుదిజట్టులో ఒకటి లేదా రెండుమార్పులు చోటు చేసుకొనే అవకాశం
లేకపోలేదు.
డబుల్ సెంచరీల మొనగాడు రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ గా తొలి సిరీస్ ను తన అమ్మమ్మగారి ఊరిలోనే సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడు. విశాఖ వేదికగా టీమిండియా ఇక ఆరో విజయంతో పాటు రెండో సిరీస్ ను సాధించటమే తరువాయి. స్టీల్ సిటీ మరోసారి మెన్-ఇన్- బ్లూ విజయాల అడ్డాగా మిగిలిపోవాలని కోరుకొందాం.