సౌతాఫ్రికాతో జరిగిన ఐదో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 73 పరుగుల తేడాతో మ్యాచ్ గెలుచుకున్న టీమిండియా వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. సెంచరీతో రాణించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇక మ్యాచ్ జరిగిన తీరును ఒకసారి పరిశీలిస్తే... మొదట టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ బరిలోకి దిగారు. ఆరంభంలోనే దూకుడుగా ఆడుతూ ఫోర్లు బాదిన శిఖర్ ధావన్ స్పీడ్‌కు రబడ బ్రేకులు వేశాడు. ఏడో ఓవర్లో రబడ బౌలింగ్‌లో ధావన్ ఫెలుక్‌వాయోకు క్యాచ్‌గా చిక్కి వెనుదిరిగాడు. ధావన్ ఔటయిన తర్వాత క్రీజులోకొచ్చిన కోహ్లీ 36పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. మోర్కెల్ బౌలింగ్‌లో డుమ్నీ కోహ్లీని రనౌట్ చేశాడు. ఆ తర్వాత రహానే కూడా రబడ బౌలింగ్‌లో పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. ఇలా ఇద్దరు కీలక బ్యాట్స్‌మెన్స్ రనౌట్ అయ్యారు. అయితే కోహ్లీ, రహానే ఇద్దరూ రనౌట్‌గా వెనుదిరగడానికి రోహిత్ కారణమనే అసంతృప్తితో ఉన్న తరుణంలో దూకుడు పెంచాడు.
భారత్ 200 పరుగులకు చేరుకునే సమయానికి రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. 107బంతుల్లో 101 చేసి 10ఫోర్లు, 4సిక్స్‌లతో సత్తా చాటాడు. అయితే రోహిత్ శర్మ విజృంభణకు బౌలర్ లుంగి ఎంగిడి అడ్డుకట్ట వేశాడు. రోహిత్‌ను 115పరుగల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ చేశాడు. క్లాసెన్ క్యాచ్ పట్టడంతో రోహిత్ వెనుతిరగక తప్పలేదు. అనంతరం శ్రేయాస్ అయ్యర్ 30పరుగులు చేసి ఔటయ్యాడు. హార్థిక్ పాండ్యా డకౌట్ అయ్యాడు. ఎంస్ ధోనీ 13పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో నిర్ణీత 50ఓవర్లు ముగిసే సమయానికి భువనేశ్వర్ కుమార్(19), కుల్‌దీప్ యాదవ్(2) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 274పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడికి 4, రబడకు ఒక వికెట్ దక్కింది.
275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు భారత బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు. తొమ్మిదో ఓవర్ బౌలింగ్ చేసిన బుమ్రా దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్క్‌రమ్‌ను పెవిలియన్‌కు పంపాడు. కోహ్లీ క్యాచ్ పట్టడంతో మార్క్‌రమ్ 32పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత 10వ ఓవర్లో డుమ్నీని హార్థిక్ పాండ్యా ఔట్ చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా రెండు కీలక వికెట్లను కోల్పోయింది. ఈ షాక్ నుంచి తేరుకునే లోపే 12వ ఓవర్ చివరి బంతికి ఏబీ డివిలియర్స్ వికెట్‌ను తీసి హార్థిక్ పాండ్యా దక్షిణాఫ్రికా జట్టును కష్టాల్లోకి నెట్టేశాడు. ఆమ్లా 71పరుగులతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్స్‌లో మిల్లర్ 36, క్లాసెన్ 39, ఫెలుక్‌వాయో(0), రబడ(3), షంసీ(0), మోర్కెల్(1) పరుగులు చేశారు. దీంతో 42.2 ఓవర్లకే దక్షిణాఫ్రికా 201 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 4వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆ తర్వాత హార్థిక్ పాండ్యా 2, చాహల్ 2, బుమ్రా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను దక్కించుకోవడంతో టీమిండియా అభిమానులు సంబరాలు చేసుకున్నారు.