కోహ్లీ ప్రొఫినల్ క్రికెటర్.. జట్టులో ఎప్పుడూ పాజిటీవ్ ఎనర్జీ నింపుతాడు: ఇషాంత్
కెప్టెన్ గా జట్టులో కోహ్లీ ఎప్పుడూ పాజిటీవ్ ఎనర్జీ నింపుతాడని, అతను ఎంతటి ప్రొఫిషినల్ ఆటగాడో అందరికీ తెలుసని అంటున్నాడు టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ. ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలిటెస్ట్ లో తన ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు ఇషాంత్. రెండో ఇన్నింగ్స్ లో ఇషాంత్ 5వికెట్లు సాధించడంతో ఇంగ్లండ్ 180 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ లో టెస్ట్ సిరీస్ కు ముందు ఇక్కడే కౌంటీల్లో ఆడటం తనకు కలిసి వచ్చిందంటున్నారు. తన శ్రమకు తగ్గ ఫలితం దక్కిందంటూ ఆనందం వ్యక్తం చేశాడు.
అంతర్జాతీయంగా టెస్ట్ కెరీర్ లో ఇషాంత్ 5వికెట్లు దక్కించుకోవడం ఇది 8వ సారి. ఇంగ్లండ్ పై రెండోసారి. టెస్ట్ సిరీస్ కు ముందు ఇషాంత్ కౌంటీ క్రికెట్ ఆడాడు. ససెక్స్ తరపున నాలుగు మ్యాచుల్లో 15వికెట్లు పడగొట్టాడు. ఒక అర్ధశతకం కూడా నమోదు చేశాడు. అదే ఇప్పుడు తనకు కలిసి వచ్చిందంటున్నాడు ఇషాంత్.
టెస్ట్ మూడో రోజు మ్యాచ్ అనంతరం ఇషాంత్ మీడియాతో మాట్లాడాడు. గత ఐపీఎల్ లో చోటు దక్కకపోవడం నిరాశకు గురయ్యానని, ఆ తర్వాత అంతా మనమంచికే అనుకున్నానన్నాడు. అయితే కౌంటీల్లో ససెక్స్ తరఫున ఆడుతూ డ్యూక్స్ బాల్స్‌తో బంతులేయడం తనకు బాగా కలిసొచ్చిదన్నాడు ఇషాంత్. మొదటి ఇన్నింగ్స్‌లో ఎడమ చేతి బ్యాట్స్‌మెన్‌కు దూరంగా బంతులు వేశానని.. కానీ, ఆ తర్వాత బౌలింగ్ కోచ్ వచ్చి స్టంప్స్‌కు నేరుగా బంతులేయమని చెప్పినట్లు తెలిపాడు. దీంతో బంతిని స్వింగ్ చేస్తూ బౌలింగ్ చేసి ఫలితం రాబట్టినట్లు తెలిపాడు. తనకు ఢిపెన్సివ్ బౌలర్ అనే ట్యాగ్ ఉందని... ఇప్పటికే ఆ ట్యాగ్‌తో అలసిపోయానన్నాడు. తాజా ప్రదర్శనతో దానికి ముగింపు పడుతుందనే అనుకుంటున్నా.. అంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. కౌంటీల్లో 50పరుగులు చేసిన తనకు ఈ మ్యాచ్ లో పరుగులు చేయగలనన్న నమ్మకం ఉందన్నాడు ఇషాంత్. అయితే తనకు ఆ అవసరం రాబోదని.. కోహ్లి- దినేశ్ కార్తిక్ మ్యాచ్ ను ముగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో ఇషాంత్ దెబ్బకు 180 పరుగలకే కుప్పకూలిన ఇంగ్లండ్.. భారత్ ముందు 194పరుగల లక్ష్యాన్ని ఉంచింది.