భగవద్గీత పంచమ వేదం. సనాతన ధర్మానికి అదే మూలం. అందులోని అంశాలు విశ్వానికి, కాలానికి కేంద్రాలు. సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్ముడి నోటి నుంచి వచ్చిన ప్రతీ మాటను వేదంగా, శాసనంగా చేసుకుంటూ వస్తుంది సమాజం. ఇంతకీ భగవద్గీతలో ఏముంది? గీతలోని 18 అధ్యాయాలు ఏం చెప్పాయి.? నేను నా వాళ్లను చంపుకోలేను ఎవరినీ చంపలేనూ అంటూ అర్జునుడు అస్త్ర సన్యాసం చేసినప్పుడు గీతాసారాన్ని పరమాత్ముడు ఎలా వివరించాడు? మానవాళికి ఎలాంటి బోధ చేశాడు? అందుకు ఐఐటీ కాన్పూర్ ఏం చేస్తోంది?
భగవద్గీతను చదివితే తత్వం బోధపడుతుంది. జీవితం విలువ తెలుస్తుంది. పాప పుణ్యాల సారం అర్థమవుతుంది. చదివినప్పుడే కాదు విన్నప్పుడు కూడా గీతలోని రాతలు మానవ తలరాతలు మార్చే కలాలు గీతలోని అంశాలు. తన వాళ్లను చంపకుండా తనువు చాలించే కంటే చంపి చరితార్థుడివి కావాలంటూ పార్థుడిని యుద్ధానికి సన్నద్ధం చేస్తాడు పార్థసారథి. ఈ గీతోపదేశాన్ని అర్జునుడికి చేసినా అందులోని గీతాసారం మాత్రం సమస్త మానవాళికి ఓ గొప్ప సైకాలిజిస్టుగా పనిచేస్తుందనడంలో సందేహమే లేదు. అందులోని 18 అధ్యాయాలు జీవితంలోని వివిధ రకాల అంశాలను వివరిస్తుందనడంలో అనుమానం లేదు. భగవంతుడే స్వయంగా బోధించిన గీత సర్వ మానవాళికి ఉపయోగపడేదే.
నేను, నా వాళ్లు, నా ఆత్మ, పరమాత్మ, పరమాత్ముడి పట్ల భక్తీ, మోక్ష సాధన, దేవదేవుడిలో ఐక్యం ఇవే గీతలోని ముఖ్యాంశాలు. ఆ ఆధారంగానే చేసుకొని భగవంతుడు గీతను ప్రవచించాడు. వ్యాసుడు రచించాడు. అందుకే గీతను చదువుకునేందుకు యోగలు, మునులు, రుషులు, సిద్ధపురుషులు చాలా రకాలుగా సాధన చేశారే కానీ అందులోని సారాన్ని ఆసాంతం ఆస్వాదించలేదు. మనం చేయాల్సిన పనేంటో, ఫలితం ఆశించకుండా దాన్నెలా చేయాలో చెబుతుంది గీతలోని తొలి పాఠం. మనస్ఫూర్తిగా, త్రికరణశుద్ధిగా ఓ పనిని చేస్తే ఫలితం దానంతట అదే అద్భుతంగా వస్తుందని గీతాచార్యుడు బోధిస్తాడు. కట్టెపై కాలే శరీరం శాశ్వతం కాదంటూ చిరిగిన వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని ఎలా ధరిస్తామో ఆత్మ కూడా కాలిన శరీరం నుంచి వీడి కొత్త శరీరాన్ని వెతుక్కుంటూ పోతుందని తత్వసారాన్ని వివరిస్తాడు కృష్ణ భగవానుడు.
ప్రపంచంలో ఊపిరి తీసుకున్న వారు ఏదో ఒకరోజు ఈ ప్రపంచాన్ని వీడి పోవాల్సిందే. ఎవరు శాశ్వతం కాదంటుంది గీత. పుట్టుక ఎంత సహజమో చావు కూడా అంతే సహజమని, సత్యమే చివరికి నిజమైనదని చెబుతాడు గీతాచార్యాడు. కోపాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలియాలంటే గీతను చదవాల్సిందే.
అన్ని అనర్ధాలకు మూలం కోపం. దాని నుంచే నరకానికి మూడు ద్వారాలు తెరుచుకుంటాయంటాడు పరమాత్ముడు. కోపం మొదటిదైతే మోహం, ఆశ మనిషిని నిలువునా కాల్చేస్తాయని మానసిక శాస్త్రాన్ని చెబుతాడు. కోపాన్ని అదుపులో ఉంచుకొని మనిషి విచక్షణ కోల్పోయి జ్ఞానహీనుడై పశువులా మారుతాడని హెచ్చరిస్తాడు.
బుద్ధి కర్మానుసారిణి అని స్పష్టంగా చెబుతుంది భగవద్గీత. కర్మను అనుసరించే బుద్ధి ఉటుంది. మానవుడు తన జీవిత కాలంలో కర్మలను అనుభవించి తీరాల్సిందేనని భుజం తట్టి చెబుతాడు యధువీరుడు. ప్రపంచంలో మార్పు ఎంత సహజమో కూడా చాలా చక్కగా వివరించాడు. కోటీశ్వరుడు బిచ్చగాడుగా, బిచ్చగాడు కోటీశ్వరుడిగా మారుతాడని, ఏదీ ఎవరికీ శాశ్వతంగా ఉండదని, కాలం ఒక తీరు గడపాలని పార్థునకు గీతోపదేశం చేస్తాడాయన.
ఖాళీ చేతులతో ఏడ్చుకుంటూ భూమ్మీదికి వచ్చిన మనిషిని చూసి చుట్టుపక్కల వారు సంతోషపడతారు అదే మనిషి ఖాళీ చేేతులతో లోకాన్ని విడిచి వెళ్లేటప్పుడు ఏడ్చుకుంటూ సాగనంపుతారు. లోకం తీరు ఇలా ఉంటుందని బోధిస్తాడు రాధేయుడు. రోజు దుఖించే వాడికి సుఖశాంతులు ఉండవనీ, నిత్య శంకితుడిగా భూమ్మీదికి వచ్చిన తర్వాత అతనికి మానసిక శాంతికి బదులు మనస్సు అశాంతికి గురవుతుందని చెబుతారు. తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తేనే మానవుడు సుఖశాంతులకు దగ్గరవతాడని, ఉన్నంతలో సంతోషంగా ఉండగలుగుతాడని వివరిస్తాడు కృష్ణుడు.
జరిగింది మంచే జరిగిందనీ, జరుగుతుంది, జరగబోయేది కూడా మంచే జరుగుతుందని భవిష్యత్తుపై భరోసా ఇస్తాడు కృష్ణుడు. ఏది జరిగిన అంతా మన మంచికే అని నమ్మి దాన్నే ఆచరించిన మానవుడికి ఎప్పుడు మంచే జరుగుతుందని చెబుతాడు. నిమిత్త మాత్రుడైన మానవుడు తన చేతుల్లో ఉన్న కర్మలను ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించాలని, కర్మ సిద్దాంతాన్ని నమ్మి తీరాలని సమగ్రంగా అర్జునుడికి వివరిస్తాడు కృష్ణ పరమాత్ముడు.
ప్రపంచానికి జ్ఞానమార్గాన్ని బోధించిన ఉద్‌గ్రంథం భగవద్గీత. మానవ జీవన విలువల సారాన్ని రంగరించిన మహోత్కృష్ట గ్రంథం భగవద్గీత. సమస్తమానవాళికి కర్తవ్య బోధను చేసిన కృష్ణుడు తన భాషణను బాహ్య ప్రపంచానికి బాహాటంగా విడమరిచి చెప్పిన గ్రంథం భగవద్గీత. అలాంటి గీతాసారాన్ని నేటి తరానికి అందించాలన్న సత్సంకల్పం చెప్పుకుంది కాన్పూర్ ఐఐటీ.
మానవ జీవితానికి దిశా నిర్దేశం చేసిన గీత మార్గదర్శకత్వం చేసే మహాగ్రంథం. భరతజాతికి గీతా శాస్త్రం ఓ ఉద్గంథ్రం. మనిషి ఎలా బతకాలి? ఎలా బతకకూడదు అని చెప్పే ఓ డిక్షనరీ. ఈ గీతాసారమే పాండవులు శత్రు సేన అయిన కౌరవులపై విజయం సాధించడానికి తోడ్పడింది. దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు సాయపడింది.
కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను చంపేందుకు వెనకాడుతూ అర్జునుడు అస్త్ర సన్యాసం చేసినప్పుడు శ్రీకృష్ణుడు చేసిన బోధే గీతాసారం. జీవన విలువల సారాన్ని తనలో ఇముడ్చుకున్న ఈ గీతా శాస్త్రం చెప్పేది అందరూ శాంతిగా, సంయమనంగా జీవించమనే.
కాన్పూర్ ఐఐటీ వెబ్‌సైట్‌లో హిందూ గ్రంథాలు జీవం పోసుకుంటున్నాయి. టెక్నాలజీ పరంగా ఎన్నో అద్భుతాలు సృష్టించిన కాన్పూర్ ఐఐటీ ప్రాచీన గ్రంథాలకు డిజిటల్ రూపం ఇచ్చి తమ వెబ్‌సైట్‌లో అందరికీ అందుబాటులో ఉంచింది. అదే గీతా సూపర్‌సైట్! భావంతో సహా భగవద్గీతను అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తుల్లోని మూలమంత్రాలు, యోగ విజ్ఞానాన్ని నేర్చుకునే వీలు కల్పించింది ఈ ఐఐటీ.
ప్రాచీన హిందూ గ్రంథాల్లోని ధర్మసూక్ష్మాలను గీతా సూపర్ సైట్ పేరుతో తెలుగు సహా 11 భారతీయ భాషల్లో కాన్పూర్ ఐఐటీ అందిస్తోంది. వేద విజ్ఞానాన్ని, వేదాంతాన్ని సులువుగా అందరూ అర్థం చేసుకునే రీతిలో హిందూ పవిత్ర గ్రంథాల డిజిటలీకరణ చేపట్టి..ఈ సేవలు అందిస్తున్న తొలి ఇంజనీరింగ్ కాలేజ్‌గా నిలిచింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఈ ప్రాజెక్టు కోసం నిధులు అందించింది. కాన్పూర్ ఐఐటీలో వాజ్‌పేయ్ హయాంలో మొదలైన ఈ కార్యక్రమం ఇప్పుడు తుది రూపు దిద్దుకుంటుంది.
మతపరమైన గ్రంథాలకు టెక్ట్స్, ఆడియో సేవలు అందించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జ్ఞానాన్ని పంచే ఈ పవిత్రమైన కార్యాన్ని మతం కోణంలో చూడకూడదంటున్నారు ఐఐటీ కాన్పూర్. సంస్కృతంలోని ప్రాచీన గ్రంథాలను అనువదించడానికి స్వామి బ్రహ్మానందతో పాటు బెనారస్ హిందూ యూనివర్సిటీ సేవలు తీసుకున్నారు. గీతా సూపర్ సైట్ సేవలు ప్రారంభించినప్పటి నుంచీ కాన్పూర్ ఐఐటీ వెబ్‌సైట్ ట్రాఫిక్ పెరిగింది. కొద్ది నెలలుగా ఆన్‌లైన్ రీడర్స్ విపరీతంగా పెరిగారు. గతంలో సగటున 500 హిట్స్ నమోదైతే.. తాజాగా రోజుకు 24 వేల హిట్స్ రిజిస్టర్ అవుతుండటం విశేషం.