చలికాలంలో చర్మం పగుళ్లు సమస్య అయితే చుండ్రు మరో ప్రధాన సమస్య. చర్మం పగుళ్ల నివారణ కోసం ఎటువంటి సంరక్షణ తీసుకుంటారో, అలాంటి రక్షణ తల మీద కూడా తీసుకోవడం చాలా అవసరం. చలికాలంలో తల, జుట్టు పొడిబారకుండా ఆరోగ్యంగా క్లీన్ గా ఉంచుకొన్నట్లైతే ఎటువంటి ఇన్ఫెక్షన్ కానీ, చుండ్రు సమస్యలు కానీ రావు. ఎవరైతే చుండ్రు సమస్యతో ఇబ్బందిపడుతుంటారో అటువంటి వారికి హెయిర్ మాస్క్ లు ఉపయోగపడతాయి.ఇంట్లోనే అతి తక్కువ ఖర్చుతో సులువుగా హెయిర్ మాస్క్ లు తయారు చేసుకోవచ్చు.
హెయిర్ మాస్క్ లు తయారుచేసుకోవడానికి ముఖ్యంగా నిమ్మరసం, తేనె, గుడ్డు దోహదతాయి. ఇవి జుట్టులో ఉండే అన్ని రకాల సమస్యలను నివారిస్తాయి. అంతేకాకుండా తలలో చుండ్రును నివారించడానికి ఇది బాగా సహాయపడుతుంది. ఒక గుడ్డును పగులగొట్టి, గిన్నెలో వేసి బాగా గిలకొట్టాలి. తర్వాత అందులో నిమ్మకాయలోని సగం బాగం యొక్క నిమ్మరసాన్ని, ఒక చెంచా తేనెను కూడా వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. ఈ మాస్క్ వేసుకోవడం వల్ల చుండ్రుతో పోరాడుతుంది. గుడ్డు జుట్టుకు పోషణను అందిస్తే, తేనె జుట్టుకు తగినంత తేమను అందిస్తుంది. ఈ హెయిర్ మాస్క్ వేసుకొన్న అరగంట తర్వాత రెగ్యులర్ షాంపుతో తలస్నానం చేయాలి.ఇలా కొన్ని రోజుల పాటు చేయడం వలన చుండ్రు సమస్య దూరమవుతుంది.
అలాగే బాగా పండిన అరటిపండ్లను ముక్కలు చేసి మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. ఆ పేస్ట్ ను తేనె, నిమ్మరసం, నూనెను ఒక్కోచెంచా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. ఇక అరగంట తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం ద్వారా జుట్టుకు తగినంత తేమ కూడా వస్తుంది. దాంతో చలికాలంలో వచ్చే చుండ్రు సమస్య దూరమవుతుంది