గుండెపోటు ముప్పును ఇక ముందుగానే కనిపెట్టొచ్చు. హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు వంద గంటల ముందే గుండెపోటును కనిపెట్టే పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా కేంద్రానికి నివేదించడంతో దానికి ఆమోదం లభించింది. ఇది అందుబాటులోకి వస్తే.. గుండెపోటు ముప్పు నుంచి బయటపడొచ్చు.
గుండెపోటును వంద గంటల ముందుగానే గుర్తించడానికి వీలయ్యే సాంకేతికత అభివృద్ధి చెందింది. హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు ఆ ఆవిష్కరణకు రూపమిచ్చారు.
ఇప్పటికే వారు రూపొందించిన ప్రొటోటైప్ బయోచిప్‌ను మార్కెట్ లోకి తెచ్చేందుకు వీలుగా సాయం చేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు నివేదించారు. దీంతో ఈ ఆవిష్కరణకు వారి ఆమోదముద్ర లభించింది.
తీవ్ర అలసట, విపరీతంగా చెమటలు పట్టడం లాంటి లక్షణాలు కనిపించడంతో పాటు అధిక రక్తపోటు సంభవించిన సమయంలో ఆ వ్యక్తి రక్తాన్ని తీసుకొని ఈ పరికరంపై ఉంచితే ముందుగానే గుండెపోటును ముప్పును కనిపెట్టొచ్చు. ఈ పరికరం గుండెపోటుతో జరిగే మరణాలను తగ్గించడానికి దోహదం చేస్తుందని ఐఐటీహెచ్ పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.