పాకిస్ధాన్ రాజకీయాల్లో పనామా పేపర్స్ మరో సారి ప్రకంపనాలు స్పష్టించింది. ఈ వ్యవహారంలో నమోదైన తొలి కేసులో దోషిగా తేలిన మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ రెండో కేసులోనూ దోషిగా తేలారు. సౌదీ అరేబియాలోని అల్-అజీజియా స్టీల్ పరిశ్రమ ఏర్పాటులో షరీఫ్ అవినీతికి పాల్పడినట్లు న్యాయస్ధానం నిర్ధారించింది. షరీఫ్‌ను దోషిగా తేల్చడంతో పాటు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ అకౌంటబిలిటీ కోర్టు తీర్పు వెలువరించింది. ఇదే వ్యవహారంలో నమోదైన ఫ్లాగ్‌షిప్ పెట్టబడుల కేసులో మాత్రం షరీఫ్‌ను నిర్దోషిగా గుర్తించింది. తీర్పు నేపథ్యంలో షరీఫ్‌ను అరెస్టు చేసి రావల్పిండి జైలుకు తరలించారు. తొలి కేసులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో సెప్టెంబరులో ఇస్లామాబాద్ హైకోర్టు షరీఫ్, ఆయన కుమార్తె, అల్లుడికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇప్పటికి వీరంతా బయట ఉన్నారు. తాజా పరిణామాల నేపధ్యంలో షరీఫ్ తనకు బెయిల్ లభించే వరకు జైలులోనే గడపాల్సి ఉంది.