సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు విచారణ వేగవంతమైంది. ఇప్పటికే హత్యలో పాలుపంచుకున్న ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను బుధవారం పోలీసులు మిర్యాలగూడలోని అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఎం.శోభారాణి ఎదుట హాజరు పరిచారు. ఈ కేసులో తిరునగరు మారుతీరావు, సుభాష్‌శర్మ, అస్గర్‌అలీ, మహ్మద్ బారీ, ఎంఏ కరీం, తిరునగరు శ్రవణ్‌కుమార్, శివలపై హత్యా నేరం, కుట్ర వంటి కేసులతోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద పలు కేసులు నమోదయ్యాయి. ఇక ప్రణయ్ హత్యకేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని నల్లగొండ జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ ఏవీ రంగనాథ్‌లు ప్రణయ్ భార్య అమృత, ప్రణయ్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. బుధవారం అమృత, ప్రణయ్ కుటుంబ సభ్యులు నల్లగొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వారిని కలిశారు. ఈ సందర్బంగా అమృతకు ప్రభుత్వం నుంచి రూ.8 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని కలెక్టర్ తెలిపారు. రూ.4లక్షలు అందజేశామని, ఉద్యోగం, ఇల్లు మంజూరు చేస్తామని వారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.